టాలీవుడ్ 'సూపర్ స్టార్' ఇక లేరు

టాలీవుడ్ 'సూపర్ స్టార్' ఇక లేరు

తెలుగు సినీ చరిత్రలో ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. సాహస సినిమాలకు కేరాఫ్. అందుకే టాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యారు కృష్ణ. నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు తీశారు. ఫిల్మ్ స్టూడియో నిర్మించి.. ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. భారతీయ సినిమా రంగంలో లెజెండ్ అనిపించుకున్నారు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 

కృష్ణ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి నివాళులు అర్పించారు.

కృష్ణ మరణం ప్రపంచ చిత్ర పరిశ్రమకు తీరని లోటు: ఆర్ నారాయణమూర్తి

కృష్ణ పార్థివదేహానికి నటుడు ఆర్ నారాయణమూర్తి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "కృష్ణ గారి మరణం ప్రపంచ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.ఆయన డేరింగ్, డాషింగ్, మానవ కోణాన్ని ఎవరు మర్చిపోలేరు. తెలుగు పరిశ్రమకి టెక్నాలజీని అందించిన వ్యక్తి కృష్ణ గారు. కామన్ మ్యాన్ కూడా ఆయన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. కౌబాయ్ మూవీస్ ని తెలుగు చిత్రసీమకు తీసుకొచ్చింది కృష్ణ నే. అల్లూరి సీతారామరాజు మూవీ ఎవరు మర్చిపోలేరూ" అన్నారు.

ప్రభాస్ నివాళి

హీరోలు ప్రభాస్, అక్కినేని అఖిల్ కృష్ణ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

కృష్ణతో ఆత్మీయ సంబంధం ఉంది: కేఏ పాల్

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నివాళులర్పించారు. "కృష్ణ గారికి నాకు ఆత్మీయ సంబంధం ఉంది. నా శాంతి సందేశాన్ని ఆయన సినిమాగా తీశారు. శాంతి, స్ఫూర్తి అందరికి చేరవేశారు. ఆయన చనిపోలేదు.ఫిసికల్ గా ఇక్కడ లేకున్నా... స్పిరిచవల్ గా మనతోనే ఉన్నారు. శాంతి కోసం ఎంతో శ్రమించారు. కృష్ణ గారి పేరిట తోచినంత సాయం అందించాలని కోరుతున్నను" 

కల్మషం లేని వ్యక్తి : బాబు మోహన్

కృష్ణ కల్మషం లేని వ్యక్తి అని అన్నారు బాబు మోహన్.  ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించలన్నారు.

మంచి మిత్రున్ని కోల్పోయా : కేసీఆర్

 

 


కృష్ణతో ఉన్న సానిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు సీఎం కేసీఆర్. వ్యక్తిగతంగా మంచి మిత్రున్ని కోల్పోయానని చెప్పారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ఎన్నోసార్లు చూశానని  తెలిపారు . కృష్ణ ముక్కుసూటి మనిషని కీర్తించారు.  అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. 

 

కృష్ణ  భౌతికకాయానికి  సీఎం కేసీఆర్  నివాళులు

సూపర్ స్టార్ కృష్ణ  భౌతికకాయానికి  సీఎం కేసీఆర్  నివాళులు అర్పించారు. అనంతరం మహేష్ బాబుతో పాటుగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీష్, పువ్వాడ ఉన్నారు.

రేపు మధ్యాహ్నం కృష్ణ అంత్యక్రియలు


సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రేపు ( బుధవారం) మధ్యాహ్నం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఇవాళ సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్ కు తరలిస్తారు.

 

ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజండరీ : మోడీ


కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్స్టార్.

ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో  వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి


 

కృష్ణాజీ మరణవార్త విషయం నన్నెంతో బాధించింది : రాహుల్‌గాంధీ

 

తెలుగు సినిమా సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణాజీ మరణవార్త విషయం నన్నెంతో బాధించింది. వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధత, విలువలు ప్రజలకు ఆదర్శం.

ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ

 

 

మా కుటుంబానికి తీరని లోటు : ఘట్టమనేని కుటుంబం
 

 

మా కుటుంబానికి కృష్ణ గారి మృతి తీరనిలోటు. కేవలం వెండితెరపైనే కాదు, ప్రేమ, మానవత్వం, ఆప్యాయత పంచడంలోనూ ఆయన సూపర్‌స్టారే. ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ద్వారా మన మధ్య జీవించే ఉంటారు.

అన్నింటికన్నా మిన్నగా మమ్మల్ని ప్రేమించారు. ఇక ప్రతి రోజూ ఆయన్ని కోల్పోయిన భారంతోనే గడుపుతాం ఘట్టమనేని కుటుంబం

 


తెలుగు సినిమా ఐకాన్  : కమల్ హాసన్

 


తెలుగు చిత్రసీమలో అగ్రతారగా వెలుగొందిన కృష్ణ కన్నుమూశారు. తెలుగు సినిమా ఐకాన్ కృష్ణ గారు ఇక లేరు. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. ఆయనకు నా నివాళులు.

ఇప్పటికే తల్లి, సోదరుడిని కోల్పోయిన మహేశ్ కు ఇప్పుడు తన తండ్రిని కోల్పోయిన ఈ మూడవ మానసిక గాయాన్ని ఎవరూ పూడ్చలేరు. ప్రియమైన మహేష్ గారికి నా ప్రగాఢ సానుభూతి.

 

 

ఎప్పటికీ మంచి జ్ఞాపకమే : రజనీ కాంత్

 

 

కృష్ణ గారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు... ఆయనతో కలిసి 3 సినిమాల్లో నటించడం నాకు ఎప్పటికీ మంచి జ్ఞాపకమే.

ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
 

 


ఎప్పటికీ  చిరస్థాయిగా నిలిచిపోతారు : కార్తీ

 


కృష్ణ గారు చాలా సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

పూర్తి జీవితాన్ని గడిపిన సూపర్ స్టార్. ప్లీజ్ దృఢంగా ఉండండి మహేష్ అన్నయ్య. ఇది చాలా కష్టతరమైన సంవత్సరం. 

 

 

వార్త వినడానికే చాలా బాధగా ఉంది : శ్రీకాంత్

 


లెజెండరీ సూపర్‌స్టార్ కృష్ణ గారు ఇక లేరనే వార్త వినడానికి చాలా బాధగా ఉంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సార్.

మహేశ్ బాబు, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

 

 

ది మ్యాన్..ది లెజెండ్..సూపర్ స్టార్ : అక్కినేని నాగార్జున

 


ఏ జనరేషన్ లో అయినా నిర్భయంగా నిలబడిన మనిషి!! తెలుగు సినిమాలకు అసలైన కౌబాయ్!! నేను అయనతో ఉంటే.. అన్నీ పాజిటివ్ గానే అనిపిస్తాయి. 

ది మ్యాన్ ది లెజెండ్ సూపర్ స్టార్   వి మిస్ యు.
 

 

 

కృష్ణ మరణం చిత్రసీమకు తీరని లోటు : తలసాని 

 

 

ప్రముఖ చలనచిత్ర నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి అకస్మిక మరణం దిగ్ర్భాంతికరం. 350 పైగా సినిమాల్లో నటించి, నిర్మాతగా, దర్శకుడు గా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ గారు సేవలను అందించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారు.

కృష్ణ గారి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు. కృష్ణ గారి  కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. 

 

 

వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు : నారా లోకేశ్

 

 

సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. విభిన్న పాత్రలతో ఆయన చేసిన ప్రయోగాలు, వేగంగా సినిమాలు పూర్తి చేయడంలో సృష్టించిన రికార్డులు, నేటి సినీ  రంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకుల నుండి బయటపడేందుకు ఒక మార్గం.

వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.


 

 

 సాహసానికి మరో పేరు  :  జూ. ఎన్టీఆర్

‘‘కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు  పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం’’

 

తెలుగుజాతి ఎన్నటికీ మరువలేని అమరజీవులు : తెలుగుదేశం పార్టీ

‘‘సినీ స్వర్ణయుగపు రారాజులు... కళామతల్లిని ధన్యురాలిని చేసిన ముద్దుబిడ్డలు... తెలుగుజాతి ఎన్నటికీ మరువలేని అమరజీవులు’’

 

 

వెండి తెరకు ప్రాణం పోసిన గొప్ప వ్యక్తి కృష్ణ : హరీశ్ రావు

 

 

వెండి తెరపై "సూపర్ స్టార్"  గా వెలుగొందిన హీరో కృష్ణ గారి మృతి బాధాకరం. ఒక సామాన్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి, ఒక  సినీ శక్తిగా మారి, పరిశ్రమలో  "సూపర్ స్టార్ " గా ఎదిగిన కృష్ణ గారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాను.

నటుడిగా,దర్శకుడిగా,నిర్మాతగా.. అల్లూరి సీతారామరాజు, కౌబాయ్, జేమ్స్ బాండ్ లాంటి ప్రయోగాలకు శ్రీకారం చుట్టి తెలుగు సినిమా స్థాయిని పెంచి, వెండి తెరకు ప్రాణం పోసి, సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి కృష్ణ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న.

 

 

బాధపడాల్సిన అవసరం లేదు : రామ్ గోపాల్ వర్మ

 
 

కృష్ణ గారు చనిపోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణ, విజయ నిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. 

 

సినిమా రంగానికి కృష్ణ చేసిన సేవలు అజరామరం : కేటీఆర్

 

 

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు. 


తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారని కేటీఆర్ అన్నారు. కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు.


 

 

చిత్రసీమకు కృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయం : పవన్ కళ్యాణ్

 

చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన సూపర్స్టార్ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాసులో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది. 


తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

 

 

వాట్ ఎ లెజెండ్ : రవితేజ

 

కృష్ణ మరణం యావత్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వాట్ ఎ లెజెండ్. నేను అతనితో పని చేయడం ఆనందంగా ఉంది. RIP #SuperStarKrishna గారూ! మహేష్ & కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను . ఓం శాంతి.

 

 

 సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరని లోటు : నందమూరి బాలకృష్ణ

 

'ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. 

కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

 

 

తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయం : కిషన్ రెడ్డి

 

 

ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు వెండి తెర ‘కౌబాయ్’ గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ గారి మృతి సినీ రంగానికి తీరని లోటు.

కుటుంబ చిత్రాలు, యువతలో, కార్మికుల్లో స్ఫూర్తిని నింపడం వంటి పాత్రలతో 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

 

 


తెలుగుజాతికి తీరని లోటు : షర్మిల 

 

కళామతల్లి ముద్దుబిడ్డ, తెలుగు సినిమాకి నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా విశిష్ట సేవలు అందించి, కొత్తదనం దిద్దిన సూపర్ స్టార్ కృష్ణ గారి స్థానం అద్వితీయం. అయన మృతి తెలుగు సినిమాకీ, తెలుగుజాతికి తీరని లోటు. కృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.


ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది :  చంద్రబాబు 

 

 

తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు.

కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ..  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

 

మాటలకు అందని విషాదం ఇది : చిరంజీవి

 

 

 

సూపర్‌ స్టార్‌ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు.ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం,మంచితనం..వీటి కలబోత కృష్ణ గారు.

అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు.తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకేగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రునివాళి. 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్‌ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ , అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకుంటున్నాను.

 

 

తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం : వెంకయ్య నాయిడు

 

 

 

ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు పరమపదించటం అత్యంత విచారకరం. వారు ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.

తన సినిమాల్లో ప్రయోగాలకు పెద్ద పీట వేసిన శ్రీ కృష్ణ గారు, అనేక నూతన సాంకేతికతలను తెలుగు తెరకు పరిచయం చేశారు. సగటును ఏడాదికి పది సినిమాల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేయటం వారి నిబద్ధతకు నిదర్శనం. తెలుగు తెరపై వారి స్ఫూర్తి అజరామరం.


 

 

 సీఎం కేసీఆర్ సంతాపం

 

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.  ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  విభిన్న కుటుంబ కథాచిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్పృహ కలిగించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో‌గా, సూపర్ స్టార్‌గా సొంతం చేసుకున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమా రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణదేనని కేసీఆర్‌ కొనియాడారు. 

 

 

వైఎస్ జగన్ సంతాపం

 

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్  సంతాపం ప్రకటించారు. ఆంధ్రా జేమ్స్ బాండ్‌గా  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని జగన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో ఆయన ఎంతో అద్భుతంగా నటించారని సీఎం గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.