- తరుముకొస్తున్న మోంథా తుపాన్
- ఇప్పటికే హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వానలు
హైదరాబాద్, వెలుగు: ఈ సీజన్‌లో తొలి తుపాన్ తరుముకొస్తున్నది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడగా.. ఆదివారం తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీనికి ‘మోంథా’ అని పేరుపెట్టారు. ఈపేరును థాయిలాండ్ సూచించింది.
మోంథా అంటే థాయిలాండ్ భాషలో ‘పరిమళించే పువ్వు లేదా అందమైన పువ్వు’ అని అర్థం. కాగా, ఈ తీవ్ర తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 28న ఆ తీవ్ర తుపాను కాకినాడ–కళింగపట్నం రేవుల వద్ద తీరం దాటుతుందని తెలిపింది.
దీని ఎఫెక్ట్ ఇటు తెలంగాణపైనా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. వర్షాల తీవ్రతను బట్టి మార్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకూ ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను ఇష్యూ చేసింది.
ఇప్పటికే జోరువాన..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ సిటీతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో ఉదయం నుంచే మబ్బు పట్టి ఉండగా.. 11 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. తేలికపాటి చినుకులుగా మొదలైన వర్షం.. కాసేపటికే భారీ వర్షంగా మారింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.
సెంట్రల్ సిటీలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. మధ్యాహ్నం సమయంలో వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చందానగర్, గచ్చిబౌలి, షేక్‌పేట, రాజేంద్రనగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, శ్రీనగర్ కాలనీ, ఎల్బీనగర్, చార్మినార్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
సిటీలోని చందానగర్‌లో అత్యధికంగా 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో 5.3 సెంటీ మీటర్లు, ఆర్సీపురంలో 5.2, షేక్‌పేటలో 4.2, గచ్చిబౌలిలో 4.1, రాజేంద్రనగర్‌లో 3.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ వాన పడింది. నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో 4.7 సెంటీ మీటర్లు, నిజామాబాద్ జిల్లా జానకంపేటలో 4.2, సూర్యాపేట జిల్లా నాగారంలో 3.9, నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో 3.8, నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో 3.4, కామారెడ్డి జిల్లా కొల్లూరులో 3.3, నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో 3.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.
