నేనూ ఆ కులానికి చెందినదాన్నే…

నేనూ ఆ కులానికి చెందినదాన్నే…

నిజం మాట్లాడటానికి గట్స్ ఉండాలి. అందులోనూ సున్నితమైన విషయాలపై స్పందించాలంటే సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి. ఇవన్నీ లావణ్య త్రిపాఠికి ఉన్నాయని ఆమె చేసిన ఒకే ఒక్క ట్వీట్ ప్రూవ్ చేసింది. ఇటీవల లోక్‌‌సభ స్పీకర్‌‌‌‌ కుల వ్యవస్థను ప్రోత్సహించేలా మాట్లాడటంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉందని, వారు సమాజంలో మార్గదర్శకులుగా ఉన్నారని  అన్నారాయన. ఆ మాటల్ని చాలామంది తప్పు పట్టారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ తీవ్రంగా విమర్శించారు. లావణ్య కూడా అలాగే రియాక్టయ్యింది.‘నేనూ ఆ కులానికి చెందినదాన్నే అయినా కొందరు బ్రాహ్మణులు తాము గొప్ప అనే భావనలో ఎందుకు ఉంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అయినా మనం కులాన్ని బట్టి కాదు, చేసే పనుల వల్ల ఆధిక్యత పొందాలి’ అంటూ ట్వీట్ చేసింది.

దాంతో చాలామంది ఆమె గట్స్‌‌ని మెచ్చుకున్నారు. శభాష్‌‌ అన్నారు. కానీ వివాదం చెలరేగుతుందని భయపడిందో లేక ఎవరైనా ఏమైనా అన్నారో తెలియదు కానీ… కాసేపటికి ట్వీట్‌‌ను డిలీట్ చేసేసింది లావణ్య. అయితే అప్పటికే ఆమె స్పందన చాలా మందిని చేరింది. సెలెబ్రిటీలను అందరూ ఫాలో అవుతారు కనుక వాళ్లు ఇలాంటి విషయాల మీద స్పందించడం ఎంతో అవసరమంటూ పలువురు లావణ్య తెగువకు హ్యాట్సాఫ్‌‌ చెబుతున్నారు. కానీ అదరగొట్టే ట్వీట్ పెట్టిన లావణ్య బెదిరిపోయి డిలీట్​ చేయడం మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. మరి లావణ్య ఏమంటుందో!