భర్తను కిడ్నాప్ చేసిన భార్య.. నవ్వులు పూయిస్తున్న లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' ట్రైలర్!

భర్తను కిడ్నాప్ చేసిన భార్య.. నవ్వులు పూయిస్తున్న లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి'  ట్రైలర్!

మెగా కోడలు లావణ్య త్రిపాఠి వెండితెరపైకి  రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ప్యామిలీ ఎంటర్టైనర్ ' సతీ లీలావతి ' , ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘SMS’ వంటి విలక్షణమైన చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘శాకుంతలం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటించారు. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఆకట్టుకుంటున్న ట్రైలర్

ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు, అలకలు, ఇగోల నేపథ్యంలో సాగే ఈ కథలో లావణ్య ‘లీలావతి’గా ఒదిగిపోయారు. "20 ఏళ్ల నా పెంపకంలో కనబడని నవ్వు.. మూడేళ్ల మీ సంసార జీవితంలో నీ మొఖంలో కనిపిస్తుంది అంటూ సీనియర్ నరేష్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత హిలేరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. తన భర్తను తానే కిడ్నాప్ చేసి, ఏమీ తెలియనట్లు లావణ్య చేసే నటన థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చివర్లో ఆమె ‘అరుంధతి’ గెటప్‌లో కనిపించి చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.

లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, సీనియర్ నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ తన మార్కు సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

►ALSO READ | నా పెళ్ళాం నిప్పురా! సినిమా డైలాగ్‌తో భార్యను పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్!

మే 8న విడుదల

లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, భార్యాభర్తల బంధంలోని సున్నితమైన అంశాలను కూడా ఈ సినిమాలో స్పృశించినట్లు తెలుస్తోంది. సప్తగిరి, వీటీవీ గణేష్ ల కామెడీ టైమింగ్ అదనపు ఆకర్షణ కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. వేసవి సెలవుల్లో కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని మలిచారు మేకర్స్. మరి లీలావతి తన భర్తను ఎందుకు కిడ్నాప్ చేసింది? వారి మధ్య గొడవలకు కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!