మోదీ వచ్చాకే దేశంలో శాంతిభద్రతలు : బాబూల్ మరాండి

మోదీ వచ్చాకే దేశంలో శాంతిభద్రతలు :   బాబూల్  మరాండి

జహీరాబాద్, వెలుగు : నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని జార్ఖండ్  మాజీ సీఎం బాబూలాల్  మరాండి అన్నారు. శుక్రవారం  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశంలో శాంతిభద్రతలు లోపించాయని, దోపిడీలు, అరాచకాలు, అవినీతి పాలన ఉండేదని ఆయన విమర్శించారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు, సామాన్యులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కరోనా సమయంలో కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారని గుర్తుచేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్  ఇంజన్ సర్కార్  ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. దేశంలో పెద్దఎత్తున రోడ్లు వేసి రవాణా సౌకర్యాలు మెరుగుపర్చిన ఘనత కేంద్రంలోని బీజేపీ  సర్కారుదే అని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచందర్  రాజనర్సింహకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఈ సభలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.