లాసెట్​లో 21,662 మంది క్వాలిఫై

లాసెట్​లో 21,662 మంది క్వాలిఫై

హైదరాబాద్, వెలుగు: ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్​లాసెట్, పీజీ ఎల్​సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 74 శాతం మంది క్వాలిఫై అయ్యారు. బుధవారం ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, ఓయూ వీసీ  రవీందర్, లాసెట్ కన్వీనర్ జీబీరెడ్డితో కలిసి కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ర్యాంకు కార్డులను https://lawcet.tsche.ac.in ​నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాక, బార్ కౌన్సిల్ నుంచి కాలేజీల గుర్తింపు జాబితా రాగానే అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని తెలిపారు. గత నెల 21, 22న జరిగిన లాసెట్​పరీక్షకు 28,921 మంది హాజరుకాగా.. 21,662 (74  శాతం) మంది అర్హత సాధించారు. అబ్బాయిలు 20,198 మంది ఎగ్జామ్ రాయగా, 15,619 మంది, అమ్మాయిలు 8,720 మంది ఎగ్జామ్ రాయగా.. 6,041 మంది అర్హత పొందారు. ముగ్గురు ట్రాన్స్​జెండర్లు ఎగ్జామ్ ​రాయగా ఇద్దరు క్వాలిఫై అయ్యారు. మూడేండ్ల ఎల్ఎల్​బీ కోర్సులో 20,107 మందికి 15,031 (74.76 శాతం) మంది, ఐదేండ్ల ఎల్ఎల్​బీ కోర్సుకు 6,207 మందికి 4,256 (68.57 శాతం) మంది , ఎల్ఎల్ఎం కోర్సుకు 2,607 మందికి 2,375 (91.10 శాతం) మంది ఎంట్రెన్స్​లో అర్హత సాధించారు. కాగా ఇంగ్లిష్ మీడియంలో 14,327 మంది, తెలుగు మీడియంలో 7,292 మంది, ఉర్దూ మీడియంలో 43 మంది క్వాలిఫై అయ్యారు. 

ఇంజినీరింగ్ నుంచి లాసెట్ కు
ఎల్ఎల్ బీ కోర్సు చేసేందుకు డిగ్రీ పూర్తిచేసిన వారే కాకుండా, ఇప్పటికే ఇతర ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చేసిన వారు కూడా ముందుకొస్తున్నారు. ఈ ఏడాది ఎల్ఎల్​బీలో బీటెక్, బీఈ తదితర ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వాళ్లూ 3271 మంది పరీక్ష రాస్తే 2733 మంది క్వాలిఫై అయ్యారు. అత్యధికంగా బీకాం స్టూడెంట్లు 4627 మంది, బీఏ 3282 మంది, బీఎస్సీ విద్యార్థులు 3714 మంది అర్హత సాధించారు. ఎంబీబీఎస్ అభ్యర్థులు 38 మంది పరీక్ష రాస్తే 34 మంది, బీడీఎస్ నుంచి 29 మంది రాస్తే 25 మంది, ఫార్మాడీ నుంచి 15 మంది రాస్తే 13 మంది, బీఫార్మసీ నుంచి 291 మంది ఎగ్జామ్​ రాస్తే 234 మంది క్వాలిఫై అయ్యారు.