ఇందారం-1ఏ బొగ్గు గని కార్మికులకు లే ఆఫ్

 ఇందారం-1ఏ బొగ్గు గని కార్మికులకు లే ఆఫ్

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుడడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇందారం1ఏ అండర్ గ్రౌండ్ బొగ్గు గనికి సింగరేణి యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. గోదావరి వాటర్ వార్నింగ్ లెవల్ 830 మీటర్లకు సమీపంలోకి రావడంతో గురువారం నైట్​షిప్ట్, ​ శుక్రవారం ఫస్ట్​, సెకెండ్​షిప్టులకు వచ్చే కార్మికులకు లేఆఫ్​వర్తింపజేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లే ఆఫ్​కారణంగా దాదాపు 600 టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గనుంది.1,100 మంది కార్మికులు సగం వేతనం కోల్పోయారు. 

నీటి ప్రవాహాన్ని బట్టి తర్వాతి షిఫ్టులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం సంజీవరెడ్డి, ఇందారం గని పీవో శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రక్షణ చర్యలపై ఫోకస్​పెట్టారు. అలాగే11 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలకు సంబంధించిన కేకే, ఆర్కేపీ, ఎస్ఆర్పీ, ఇందారం, ఖైరీగురా ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. ఓవర్ బర్డెన్​పనులు స్తంభించాయి.