జాబ్స్​ పోయినోళ్ల కోసం భారీ ఫండ్​

జాబ్స్​ పోయినోళ్ల కోసం భారీ ఫండ్​

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ కంపెనీల్లో తొలగింపులు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెజాన్, ట్విటర్​, మెటా వంటివి వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి వారిని ఆదుకోవడానికి అమెరికా ఆధారిత వెంచర్ ​ఫర్మ్​ డే వన్ వెంచర్స్ ఒక ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. "ఫండెడ్​ నాట్ ఫైర్డ్" పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. టెక్ క్రంచ్ రిపోర్టు ప్రకారం ఈ సంస్థ సంవత్సరాంతానికి 20 స్టార్టప్ టీమ్‌‌‌‌‌‌‌‌లకు 100,000 డాలర్ల చెక్కులను (సుమారు రూ.81 లక్షలు) ఇస్తుంది. టాప్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లు తమ ప్రీ-సీడ్ రౌండ్‌‌‌‌‌‌‌‌ కోసం  మిలియన్ డాలర్ల చెక్‌‌‌‌‌‌‌‌ను పొందవచ్చు.  మెటా, ట్విటర్​, అమెజాన్​ వంటి కంపెనీలు తొలగించిన ఉద్యోగులకు మద్దతుగా 52.5 మిలియన్​ డాలర్ల ఫండ్ నుండి ఐదు మిలియన్​ డాలర్లను (గరిష్టంగా డాలర్ల10 మిలియన్లు) కేటాయిస్తుంది. రష్యాలో రాజకీయవేత్తగా  టీవీ రిపోర్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన డే వన్​ వెంచర్స్​ ఫౌండర్​ మాషా బుచెర్ మాట్లాడుతూ ఉద్యోగం పోయినవారిలో కనీసం 0.1 శాతం నుండి ఒక శాతం మంది సక్సెస్​ఫుల్​ ఫౌండర్లు అవుతారని అన్నారు. ఇది "ఒక సేవా కార్యక్రమం కాదు" కానీ సీరియస్​ వ్యాపారం అని బుచెర్ స్పష్టం చేశారు.  

డే వన్ వెంచర్స్​తోపాటు జెడ్​ ఫెలోస్,  క్లియో క్యాపిటల్ కూడా మాజీ ఉద్యోగులకు సాయం చేస్తున్నాయి.  అమెజాన్​సహా పలు హై- ప్రొఫైల్ కంపెనీలలో ఉద్యోగాల కోత వేగవంతమైంది. ఈ వారంలో 10,000 మందిని తొలగిస్తామని అమెజాన్​ ప్రకటించింది. ఇతర టెక్ దిగ్గజాలు,  స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు కూడా  పొదుపు చర్యలను ప్రకటించాయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ చెల్లింపు సంస్థ స్ట్రైప్  కార్- హెయిలింగ్ యాప్ ‘లిఫ్ట్’ కూడా ఇటీవల ఉద్యోగులను తొలగించింది. లిఫ్ట్​, మెటా తమ వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో 10 శాతం పైగా తగ్గించుకున్నాయి. ఎలన్ మస్క్ తాజాగా కొనుగోలు చేసిన ట్విట్టర్, ఈ నెల ప్రారంభంలో దాని 7,500 మంది ఉద్యోగులలో సగం మందిని తొలగించింది. కన్సల్టింగ్ సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్  ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు, టెక్నాలజీ కంపెనీలు 31,200 మంది ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉంది.