
ఆర్థిక మాంద్యం, అనిశ్చితి భయంతో పలు దిగ్గజ కంపెనీలు సైతం తమ సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తీసివేశాయి. ఇప్పుడు ఆ లేఆఫ్స్ కల్చర్ హైదరాబాద్ కూ పాకింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే దాదాపు 15 వేల కొలువులు ఊడినట్టు తెలుస్తోంది. వచ్చే ఆర్నెళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా కేంద్రంగా ఉన్న ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు ప్రపంచవ్యాప్తంగా 2.20 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 18 వేల మంది ఉద్యోగులుండగా.. 13 వేల మంది సైబరాబాద్, బెంగళూరుల్లోని మైక్రోసాఫ్ట్ ఆర్‌అండ్‌డీ, బిజినెస్ డెవల్‌పమెంట్ సెంటర్లలో పనిచేస్తున్నారు. జనవరిలో ఈ సంస్థ లేఆఫ్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా సహా పలు దేశాల్లోనూ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది.
కొన్ని రోజుల క్రితం సైబరాబాద్ క్యాంప్‌సలోని 600 మంది ఉద్యోగులపై వేటు పడింది. త్వరలో ఇది మరింత మంది ఉద్యోగులపై ప్రభావం చూపించనున్నట్టు తెలుస్తోంది. పరిశోధన, అభివృద్ధి, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో లేఆఫ్ లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అమెజాన్‌కు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. ఇక్కడ 9 వేల మంది పనిచేస్తుండగా.. వారిలో 1,200 మందిని ఆ సంస్థ తీసివేయడం ఆందోళనకరంగా మారింది.