ఎల్ఆర్ఎస్.. రూ.150 కోట్లు

ఎల్ఆర్ఎస్.. రూ.150 కోట్లు
  • 25 శాతం రాయితీ కల్పించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం 
  • అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో రూ.21 కోట్లు 
  • అత్యల్పంగా దేవరకొండ మున్సిపాలిటీలో రూ.82 లక్షలు 
  • ఇంకా పెండింగ్​లోనే వేలాది అప్లికేషన్లు

నల్గొండ, యాదాద్రి, వెలుగు: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) ద్వారా మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరింది. 25 శాతం రాయితీతో  ఫీజు చెల్లించి, నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న అనధికార ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో ప్లాట్ల యజమానులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని12 మున్సిపాలిటీల్లో గడువు ముగిసే నాటికి రూ.77 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.73.23 కోట్లు మొత్తం రూ.150 కోట్ల ఆదాయం వచ్చింది.

3న ముగిసిన గడువు..

ఎల్ఆర్ఎస్ కింద 2020లో పలువురు రూ.1,000 చెల్లించి, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నారు. ఆ దరఖాస్తులు నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి19 నుంచి వన్ టైమ్ సెటిల్​మెంట్ చేసిన వారికి 25 శాతం ఫీజు రాయితీతో రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకు తొలుత మార్చి 31 వరకు గడువు విధించింది. అయితే, సాఫ్ట్ వేర్ లో లోపాలు, చాలా ప్లాట్లు ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉండిపోవడంతో రెగ్యులరైజ్​చేసుకునేందుకు ప్లాట్ల యజమానులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించింది. అయినా ఆశించిన స్థాయిలో యజమానులు ముందుకు రాలేదు. దీంతో ఈ నెల 3 వరకు మూడోసారి పొడిగించగా.. ఆ గడువు సైతం ముగిసింది. 

నల్గొండ జిల్లాలో రూ.39.18 కోట్లు..

నల్గొండ జిల్లాలో 7 మున్సిపాలిటీలు నీలగిరి, నకిరేకల్, చిట్యాల, హాలియా, మిర్యాలగూడ, దేవరకొండ, చండూరు ఉన్నాయి. వీటి పరిధిలో రూ.39.18 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా నీలగిరి మున్సిపాలిటీకి రూ.20.87 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.12.22 కోట్లు, నకిరేకల్ మున్సిపాలిటీకి రూ.1.95 కోట్లు, హాలియా మున్సిపాలిటీకి రూ.1.35 కోట్లు, చండూరు మున్సిపాలిటీకి రూ.91 లక్షలు, దేవరకొండ మున్సిపాలిటీకి రూ.82 లక్షలు సమకూరింది. అయితే, మొత్తం13,428 అప్లికేషన్లు ఎఫ్​టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఆన్​లైన్ లో చూపిస్తోంది. దీని కారణంగా వేలాది మంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీస్​ల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. చాలా అప్లికేషన్లు పెండింగ్ లోనే ఉన్నాయి.

యాదాద్రి జిల్లాలో రూ.73.23 కోట్లు..

యాదాద్రి జిల్లాలోని 428 గ్రామ పంచాయతీలు, 6 మున్సిపాలిటీలు భువనగిరి, ఆలేరు, యాదగిరి గుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, భూదాన్​పోచంపల్లి, అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ(యూడీఏ)లోని ప్రాంతాల్లో కలిపి 1,46,044 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 1,39,758 దరఖాస్తులకు సంబంధించిన ప్లాట్ల యజమానులకు ఆఫీసర్లు ఫీజు ఇంటిమేషన్​ఇచ్చారు. మొత్తం 38,373 మంది ఫీజు చెల్లించి, తమ ప్లాట్లను రెగ్యులరైజ్​చేయించుకున్నారు. రూ.73.23 కోట్ల ఆదాయం వచ్చింది.  

సూర్యాపేట జిల్లాలో రూ.38 కోట్లు..

సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.38 కోట్ల ఆదాయం వచ్చింది. సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65,478 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 59,135 ఫీజు చెల్లించేందుకు అర్హత పొందాయి. 12,654 మంది అర్జీదారులు ఫీజు చెల్లించారు. ఫలితంగా మున్సిపల్ శాఖకు రూ.38.39 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీకి అత్యధికంగా రూ.21.07 కోట్లు వచ్చింది. 

2,472 మందికి ప్రొసీడింగ్స్​

ఎల్ఆర్ఎస్ ఆదాయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీ ముందంజలో నిలిచింది. మొత్తం 35,633 మంది దరఖాస్తు చేయగా 31,940 మందికి ఫీజు ఇంటిమేషన్ ఇచ్చాం. 6,585 మంది చెల్లించారు. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ నిబంధనల మేరకు 2,472 మందికి ప్రొసీడింగ్స్​జారీ చేశాం. లబ్ధిదారులు తమ ఫైల్ ప్రాసెస్ కోసం ఎల్ఆర్ఎస్ సిటిజన్ లాగిన్ లో చూసుకొని, ప్రొసీడింగ్స్​నేరుగా పొందవచ్చు. – బి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట