40 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన పినరయి

40 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన పినరయి

కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్  కొత్త చరిత్ర సృష్టించింది. గత 40 ఏళ్లలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో వరుసగా రెండో సారి విజయం సాధించింది. 140 సీట్లలో 99 చోట్ల గెలిచింది. 2016 ఎన్నికలతో పోలిస్తే 8 సీట్లు పెంచుకుంది. దేశంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ ఒక్కటే. కమ్యూనిస్టులు మొట్టమొదటగా అధికారంలోకి వచ్చిన స్టేట్ కూడా కేరళనే. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు మరోసారి ప్రతిపక్ష పాత్రే దక్కింది. కేవలం 41 సీట్లకే పరిమితమైంది. ఇక బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఓడిపోయారు.

తిరువనంతపురం: దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన స్టేట్.. దైవ భూమిగా పిలిచే కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార కూటమి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) రికార్డ్ బ్రేకింగ్ విక్టరీని సొంతంచేసుకుంది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆ రాష్ట్ర ప్రజలు వరుసగా రెండుసార్లు ఏ పార్టీకీ అధికారం కట్టిన చరిత్ర లేదు. ఒకసారి కమ్యూనిస్టు పార్టీలు గెలిస్తే, మరోసారి కాంగ్రెస్ పవర్‌‌‌‌లోకి వచ్చేది. కానీ ఎన్నికల్లో పినరయి విజయన్ సారధ్యంలోని ఎల్డీఎఫ్​ కూటమి ఆ ట్రెండ్‌‌ను బ్రేక్ చేసింది. 1969 నుంచి 1979 వరకు వరుసగా రెండుసార్లు అధికారాన్ని నిలుపుకొన్న ఏకైక పార్టీగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్నాళ్లు కొనసాగింది. ఆ చరిత్రను  42 ఏండ్ల తర్వాత ఇప్పుడు విజయన్ సర్కారు తిరగరాసింది. కేరళ అసెంబ్లీలోని 140 సీట్లకు ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో 99 చోట్ల విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. 2016లో 91 సీట్లు మాత్రమే రాగా ఈసారి 8 సీట్లు పెంచుకోవడం గమనార్హం. అయితే దేశంలో ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కేరళ ఒక్కటే. గతంలో పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోనూ పట్టున్న లెఫ్ట్.. ఇప్పుడు అక్కడ దాదాపు జీరో అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో కమ్యూనిస్టులు మొట్టమొదటగా అధికారంలోకి వచ్చిన స్టేట్ కూడా కేరళనే కావడం విశేషం. 1957లో జరిగిన రెండో జనరల్ ఎలక్షన్‌‌లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ సారధ్యంలో సీపీఎం కేరళలో విజయం సాధించింది. ఆ తర్వాత రెండేండ్లకే కేంద్ర ప్రభుత్వం సీపీఎం ప్రభుత్వాన్ని రద్దు చేసినా.. నాటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఒకసారి సీపీఎం, ఒకసారి కాంగ్రెస్ పవర్‌‌‌‌లోకి రావడం ఆనవాయితీగా మారింది. అయితే ఈసారి ఆ ట్రెండ్ బ్రేక్ అయ్యి సీఎం విజయన్ రెండోసారి పవర్‌‌‌‌లోకి వస్తారని ఎగ్జిట్ పోల్స్ కూడా ముందే అంచనా వేశాయి.

కరోనాను హ్యండిల్ చేసిన తీరే..

ఎల్డీఎఫ్ వరుస విజయానికి కరోనా క్రైసిస్‌‌ను హ్యండిల్ చేసిన తీరు, 2019లో వచ్చిన వరదల టైమ్‌‌లో ప్రభుత్వ తీరు కారణమని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు. గత ఏడాది గోల్డ్ స్కామ్‌‌లో స్వయంగా సీఎం ఆఫీస్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చినా వాటిని ప్రజలు పట్టించుకోలేదని, సంక్షోభ సమయంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచిన విషయమే ప్రజల మనసులో ఉండిపోయిందని అంటున్నారు.

రాహుల్ ఫోకస్ చేసినా

కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్ రాహుల్ గాంధీ కేరళ నుంచే ఎంపీగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం కావడంతో అసెంబ్లీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీలో ఎన్నికలు జరుగుతున్నా కేరళలోని అన్ని ఏరియాలను కవర్ చేస్తూ సీరియస్‌‌గా ప్రచారం సాగించారు. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు ఎదురుదెబ్బ తగిలింది. 2016లో 47 సీట్లలో గెలిచిన కూటమి ఈసారి 41కే పరిమితమైంది. 

శ్రీధరన్ ఓటమి

కేరళలో కేవలం ఒక్క ఎమ్మెల్యేతో ఉన్న బీజేపీ ఈసారి బలం పెంచుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సారి ఆ ఒక్క సీటునూ కోల్పోయింది. నెమామ్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్ కూడా ఓడిపోయారు. మరోవైపు నిజాయతీపరుడిగా పేరున్న మెట్రోమ్యాన్ ఈ.శ్రీధరన్‌‌ను బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా యువత ఓట్లను రాబట్టొచ్చన్న అంచనాలూ తలకిందులయ్యాయి. ఆయన పోటీ చేసిన పాలక్కడ్ సీటు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది.