
న్యూఢిల్లీ: తనపై ఈడీ దాడికి సిద్ధమవుతున్నదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ కేంద్ర దర్యాప్తు సంస్థలోని కొందరు తనకు ఈ విషయం చెప్పారని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. లోక్‌సభలో ఇటీవల తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం అధికార పార్టీకి నచ్చలేదని, అందుకే దాడికి ప్లాన్ చేస్తున్నదని అన్నారు. ‘‘లోక్‌సభలో సాధారణంగా ప్రతి ఇద్దరిలో ఒకరికి నా చక్రవ్యూహం స్పీచ్ నచ్చలేదు.
నాపై దాడికి ప్లాన్ చేస్తున్నారని ఈడీలోని కొందరు నాకు చెప్పారు. వారిని నేను ఆహ్వానిస్తున్నా.. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నా” అని పేర్కొన్నారు. జులై 29న కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తదితరులపై విమర్శలు చేశారు.
రాహుల్‌గాంధీకి ప్రతిపక్ష నేతల మద్దతు
కేంద్ర సర్కారు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదనే రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు పలువురు ప్రతిపక్ష నేతలు మద్దతు పలికారు. రాహుల్వ్యాఖ్యలు సరైనవేనని, దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నేత, నాగౌర్ ఎంపీ హనుమాన్రామ్దేవ్ బేనివాల్ చెప్పారు. ‘‘ఇద్దరు సీఎంలు జైల్లో ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వారి నోరుమూయిస్తారని అందరికీ తెలుసు.
ఇది ఇలాగే కొనసాగితే ప్రతిపక్షం బలపడుతుంది. రాహుల్‌గాంధీపై ఈడీని పంపి కేంద్ర సర్కారు తప్పు చేస్తుందని నేను అనుకోను. ఒకవేళ అలాగే చేస్తే.. తీవ్ర పరిణామాలుంటాయి” అని హెచ్చరించారు. ఈడీకి రాహుల్‌గాంధీ భయపడబోరని స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అన్నారు. వివిధ అంశాలపై పార్లమెంట్లో అధికార పార్టీని ప్రశ్నిస్తున్నందుకే రాహుల్‌గాంధీపై ఈడీ దాడికి కేంద్రం సిద్ధపడుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్ పేర్కొన్నారు.
రాహుల్‌గాంధీ ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని పలువురు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాగా, రాజకీయ వేధింపుల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను వంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంపై వాయిదా తీర్మానం కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో శుక్రవారం నోటీసు సమర్పించారు.