- సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నా వెనక నుంచి చక్రం తిప్పుతున్నట్లు విమర్శలు
- అధికారులు, సంఘాల బాధ్యులను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు
- గద్వాల జిల్లాలో పరిస్థితి
గద్వాల, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాలపై ప్రజాప్రతినిధులు, నాయకులు పెత్తనం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. గద్వాల జిల్లాలో పేరుకే మహిళా సంఘాలు, ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ఆధ్వర్యంలో సెంటర్లు నడుస్తున్నా .. వెనక నుంచి లీడర్లే చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలో 81 సెంటర్లు ఏర్పాటు
వానాకాలం సీజన్ కు సంబంధించిన వడ్ల కొనుగోలుకు గద్వాల జిల్లాలో 81 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో మహిళా సంఘాలకు 63, అర్బన్ ఏరియాలో మెప్మా ఆధ్వర్యంలో 5, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 13, మిగతా సెంటర్లు ఐకేపీకి కేటాయించారు. అనేక సెంటర్లను మహిళా సంఘాల ముసుగులో ప్రజాప్రతినిధులు, లీడర్లు నడుపుతున్నట్లు తెలిసింది. అధికారులను మేనేజ్‌చేసి, తూకం, తరుగు పేరిట దోచుకుంటున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. బస్తాకు 2 కేజీల తరుగు తీయాల్సి ఉండగా 5 కేజీల వరకు తీస్తున్నారని వాపోతున్నారు.
తీర్మానం పట్టించుకోకుండానే..
కొనుగోలు కేంద్రాలను లీడర్లు చెప్పిన వారికే కేటాయిస్తున్నారని, తాము చేసిన తీర్మానాలకు విలువ లేకుండా పోతోందని పలువురు మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చిన సంఘానికి ఇచ్చేలా ఆఫీసర్లను మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు. ధరూర్ మండలం రేవులపల్లి మహిళా సంఘం కాలపరిమితి ముగిసినా గ్రామ కమిటీ అధ్యక్షురాలిని ఎన్నుకోకుండా పాతవారినే ముందు పెట్టి ఈసారి కూడా దోపిడీ చేసేందుకు స్కెచ్ వేశారని రెండు రోజుల క్రితం గలాటా జరిగింది. 2022 నుంచి ఇప్పటివరకు సంఘంలో రూ.16 లక్షల వరకు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి.
ధరూర్ కు సెంటర్ కేటాయించలే..
జిల్లాలో మొత్తం 11 పీఏసీఎస్‌లు ఉన్నాయి. గద్వాల మండలం పీఏసీఎస్ తమకు కొనుగోలు కేంద్రాలు వద్దని చెప్పగా.. అధికార పార్టీ చైర్మన్లు ఉన్న 9 పీఏసీఎస్‌లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధరూర్ మండలంలో ప్రతిపక్ష చైర్మన్ ఉండటంతో సెంటర్ కేటాయించలేదు. రెండేళ్లుగా ఇలాగే చేస్తున్నారని, తాము సెంటర్‌ను నిర్వహిస్తామని కలెక్టర్, డీసీవోను కోరినా పట్టించుకోవడం లేదని చైర్మన్వాపోతున్నారు. జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలకు 2 లక్షల టన్నుల వడ్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
సౌకర్యాలు కల్పించకున్నా బిల్లులు..
సెంటర్లకు వచ్చే రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. టెంట్, ప్యాడీ క్లీనర్లు, తాగునీరు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలి. కానీ చాలాచోట్ల ఇవేవీ లేకుండానే ఆయా సెంటర్ల నిర్వాహకులు తమ బంధువుల పేర్లపై ఏర్పాటు చేసినట్లు బిల్లులు సృష్టించి, దండుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. హమాలీల ఖర్చును తమ వద్ద నుంచే వసూలు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
రూల్స్ పాటించకపోతే చర్యలు
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రూల్స్ పాటించాలి. రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటాం. మహిళలకు కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లో లీడర్లు పెత్తనం చెలాయిస్తే ఉపేక్షించేది లేదు. రేవులపల్లి ఇష్యూపై ఎంక్వైరీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.– నర్సింగరావు, అడిషనల్ కలెక్టర్, గద్వాల.
