పానుగల్, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు జూపల్లి అరుణ్ అన్నారు. పానుగల్ మండల పరిధిలోని జమ్మాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి అంబేద్కర్ నూతన విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని పేర్కొన్నారు.
సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహానుభావుడిగా, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమించిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనను ముందుకు తెచ్చిన గొప్ప సంస్కర్త అంబేద్కర్ అని కొనియాడారు. భారతదేశంలో గొప్ప సామాజిక సంస్కర్తగా, న్యాయవేత్తగా, ఆర్థికవేత్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయనను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవి, గ్రామ సర్పంచ్ మల్లయ్య, మాజీ సర్పంచ్ నాగేంద్రం, వాగ్గేయకారుడు రాజారాం ప్రకాశ్, బీఆర్ఎస్ నాయకులు జ్యోతి నందన్ రెడ్డి, అడ్వకేట్ రవి, ప్రజా సంఘాల నాయకులు ఎర్రం నాగేంద్రం, ఎర్రం చంద్రయ్య, ఎర్రం రాములు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
