
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండల పరిషత్ ఎన్నికల తర్వాత .. నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ రసాభాసగా మారింది. సాధారణంగా ప్రత్యర్థి పార్టీల మధ్య వైరం ఘర్షణలకు దారితీస్తుంటుంది. కానీ ఇక్కడ అధికార పార్టీ ఎంపీటీసీల మధ్య ఘర్షణ తలెత్తింది.
ఎంపీపీ ఎన్నిక కాస్తా రెండు కులాల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. తమ వర్గం వారికే ఎంపీపీ పదవి కావాలంటే తమ వర్గానికే పదవి కావాలని నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించారు టీఆర్ఎస్ కార్యకర్తలు.
పేరాయిగూడెం రెండో సెగ్మెంట్ నుండి ఎన్నికైన చిట్టూరి ఫణీంద్రకు ఎంపీపీగా అవకాశం ఇవ్వాలని 1000 మంది కార్యకర్తలు రోడ్డుపై ధర్నా చేశారు. తమ నాయకుడికే ఎంపీపీ పదవి దక్కాలని, మండల నాయకత్వం అమ్ముడుపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆందోళనకారులను కంట్రోల్ చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.
ఎంపీపీ పదవి కోసం అధికార పార్టీలోని సభ్యులే ఆందోళనలకు దిగడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు పార్టీ పెద్దలు. ప్రశాంతంగా సాగే అశ్వారావుపేట రాజకీయాల్లో ఎంపీపీ ఎన్నిక చిచ్చు పెట్టిందని సీనియర్ రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.