
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కులవివక్ష చూపుతున్నారని, దళిత, అణగారిన వర్గాలు దేవుడిలా భావించే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి నిరాకరిస్తున్నారని అంబేడ్కర్ సంఘం లీడర్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్, ప్రభుత్వ ప్రజావాణి ఇన్‌చార్జి జి.చిన్నారెడ్డికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేశ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని వివిధ గ్రామాల్లో దళిత, అణగారినవర్గాల ప్రజలు అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి నిరాకరిస్తూ దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పెద్దపల్లి కలెక్టర్ వ్యవహరిస్తున్నారని వారు చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆరు నెలల కింద సుల్తానాబాద్ మండలం మంచిర్యామి గ్రామంలో 200 మంది దళితులు సమష్టిగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం గద్దెను ఏర్పాటు చేసుకుంటే కొంతమంది వ్యక్తులు కూల్చివేశారని, వారిపై ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదన్నారు. కలెక్టర్ తీరుపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి కూడా తీసుకువెళ్తామన్నారు.