
ముషీరాబాద్,వెలుగు : ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడుతూ.. భారత రాజ్యాంగాన్ని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని దళిత, ఓబీసీ, ముస్లిం సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈవీఎంలను రద్దు చేయాలని పలు డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దళిత, ఓబీసీ, ముస్లిం సంఘాల నేతలు ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఐక్యత మహాధర్నా నిర్వహించారు.
కార్యక్రమానికి వివిధ సంఘాల నేతలు హాజరై మాట్లాడుతూ.. ఓబీసీలు, మైనార్టీలకు రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని వారు పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాలో నర్సింగరావు, శంకర్, మహేశ్వర్, రాజు, డీబీఎఫ్ శంకర్, కల్పన, దాస్ రామ్ నాయక్, లక్ష్మణ్, వీరస్వామి, రాజలింగం హాజరై మాట్లాడారు.