ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎస్సీలకే ఖర్చు చేయాలి

ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎస్సీలకే ఖర్చు చేయాలి

హైదరాబాద్: ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎస్సీలకే ఖర్చు చేయాలని టిఎస్ ఎమ్మార్పీఎస్,మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం విద్యా నగర్ లోని టి ఎస్ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు చెన్నయ్య, టి ఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు మేడి.పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్, టి ఎస్ ఎం ఎస్ ఎఫ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరుగా బ్యాంకులకు సంబంధం లేకుండా ఎస్సి లోన్స్ ఇవ్వాలి,రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్.డి.ఎఫ్) పేరుతో మా ఎస్సి కార్పొరేషన్ నిధులు దానిలోకి మళ్లించి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు(ఆసరా పెన్షన్ నుండి రైతు బంధు వరకు అన్ని)  దాని నుండి అందించడం చాలా బాధాకరం అన్నారు.

ఎలాంటి అర్హతలు,ఎలాంటి కులాలు చూడకుండా కేసీఆర్ చింతమడక ప్రజలకు ఏ విధంగా పది లక్షల రూపాయలు కేటాయించారని ప్రశ్నించారు.అదే తరహాలో తెలంగాణ లో కూటికి,గూడుకు లేని ఎస్సీ లు చాలా మంది ఉన్నారని, అలాంటి వారికి కూడా పది లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. మొన్న జరిగిన సభలో ఎస్సీ కార్పొరేషన్ లో పది వేల కోట్లు ఉన్నాయని చెప్పిన కేసీఆర్.. ఆ నిధులను ఎస్సీలకే ఖర్చు చేయాలన్నారు. డిగ్రీ మరియు ఆపైన చదువుకునే విద్యార్థులకు 3000 వేల స్కాలర్ షిప్స్ ఇవ్వాలని,దానికి తోడు ఎస్సీ బ్యాక్ లాక్ పోస్టులకు గాను ఒక స్పెషల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. లేని పక్షంలో ఈ నెల 14 న ఎస్సీ మరియు అన్ని ఉపకులాలు కలిసి ఒక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం పై ఉద్యమిస్తామని హెచ్చరించారు.