- శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించాలి
- సీఎం ముఖ్య సలహాదారుడు వేం.నరేందర్ రెడ్డికి వినతి
ఇంద్రవెల్లి, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయ అభివృద్ధితో పాటు జనవరిలో ప్రారంభమయ్యే జాతరకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మెస్రం వంశీయులు సీఎం ముఖ్య సలహాదారుడు వేం.నరేందర్ రెడ్డికి విన్నవించారు.
హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో జనవరి 22న జరిగే నాగోబా మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత మౌలిక వసతులు కల్పించాలని, అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.
కేస్లాపూర్ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తించి 150 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలన్నారు. ఆశ్రమ బాలికల పాఠశాలను అప్గ్రేడ్ చేసి, డిజిటల్ క్లాసులు నిర్వహించాలన్నారు.
ఏకలవ్య పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని, కేస్లాపూర్ కు మినీ క్రీడా మైదానం మంజూరు చేయాలని కోరారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు, దేవారి మెస్రం బాదిరావు, ఆలయ పూజారి మెస్రం షేకు, మాజీ సర్పంచ్ నాగనాథ్, కేస్లాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోట్నాక్ భారికరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట్నాక్ కోసేరావు, పెందూర్ గణేశ్, ఆశ్రమ స్కూల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
