కనిపిస్తే కాల్చి పడేయండి: దుమారం రేపుతోన్న షేక్ హసీనా ఆడియో లీక్

కనిపిస్తే కాల్చి పడేయండి: దుమారం రేపుతోన్న షేక్ హసీనా ఆడియో లీక్

ఢాకా: ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 2024లో బంగ్లాదేశ్‎లో జరిగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేశారు. పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 1500 మంది చనిపోయారు. అయితే.. ఆందోళనకారులపై కాల్పులు జరిపి.. నిరసనలను ఎక్కడికక్కడ అణిచివేయాలని అప్పటి ప్రధాని షేక్ హసీనా అధికారులకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారని ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థ బీబీసీ సంచలన విషయాన్ని బహిర్గతం చేసింది.

ALSO READ | ఇదేం పద్దతి.. పప్పు బాగోలేకపోతే అలా కొడతారా..? శివసేన ఎమ్మెల్యేపై CM ఫడ్నవీస్ సీరియస్

"ఏ ఆయుధాలు కావాలన్న వాడండి. నిరసనకారులను ఎక్కడ దొరికితే అక్కడ కాల్చండి" అని 2024 జూలై 18వ తేదీ సాయంత్రం తన అధికారిక నివాసం గణభబన్ నుంచి ఒక సీనియర్ ప్రభుత్వ అధికారికి ఫోన్ ద్వారా హసీనా ఆదేశాలు జారీ చేశారని బీబీసీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన లీక్ అయిన ఆడియో టేప్‎ను బీబీసీ ధృవీకరించింది. హసీనా ఆదేశాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే బంగ్లా రాజధాని ఢాకా అంతటా పారామిలిటరీ దళాలను మోహరించి.. మిలిటరీ-గ్రేడ్ రైఫిళ్లను ఉపయోగించి జనసమూహాలపై కాల్పులు జరిపారని బీబీసీ నివేదించింది. 

అసలేం జరిగిందంటే..?

1971 మార్చిలో పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. బంగ్లా స్వతంత్ర కోసం తొమ్మిది నెలలు జరిగిన అంతర్యుద్ధంలో 30 లక్షల మంది అమరులయ్యారు. ఈ క్రమంలో షేక్​ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 1971 అమరుల వారసులకు ఉద్యోగాల్లో 30  రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. రోడ్లు, రైల్వే లైన్లను ముట్టడించారు. 

ఈ రిజర్వేషన్లతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుతుందని ఆరోపించారు. రిజర్వేషన్ల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారి అల్లర్లకు దారితీశాయి. నిప్పు రవ్వలా మొదలైన ఉద్యమం దేశాన్ని అగ్నిగుండం చేసింది. నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో 2024 ఆగస్టులో ప్రధాని షేక్​ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. అధికార పీఠం వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం నంచి షేక్ హసీనా పారిపోయి భారత్‎కు వచ్చింది.