గోధుమ గడ్డితో లాభాలివే..

గోధుమ గడ్డితో లాభాలివే..

ఊళ్లో పని దొరక్క ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్​ వచ్చిండు రాపల్లి సత్యం. పని కోసం తిరుగుతున్న  టైంలో ఒక డాక్టర్​  ఫ్రెండ్  సలహా మేరకు గోధుమ గడ్డి బిజినెస్​  మొదలుపెట్టాడు. ఒకప్పుడు అడ్డా మీద పని దొరుకుతుందేమోనని ఎదురుచూసిన అతను ఇప్పుడు 30 మందికి ఉపాధి చూపిస్తున్నాడు. 

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీపూర్​కి చెందిన సత్యం మొదట్లో తమకున్న కొద్దిపాటి స్థలంలో వ్యవసాయం చేసేవాడు. అయితే, నీళ్ల సౌకర్యం లేకపోవడంతో ఎవుసం ఆపేసి, ఉపాధి కోసం హైదరాబాద్​కి వెళ్లాడు. ఏ పని చేయాలని ఆలోచిస్తున్న టైంలో... అమెరికాలో డాక్టర్​గా పనిచేస్తున్న అతని ఫ్రెండ్​ ఒకరోజు పెళ్లిలో కలిసి, సత్యంకి గోధుమ గడ్డి రసం ఉపయోగాలు చెప్పాడు. గోధుమ గడ్డి బిజినెస్​ బాగుంటుందని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి గోధుమ గడ్డి పెంచడం మొదలుపెట్టాడు సత్యం. పార్కులు, మెయిన్ సెంటర్ల దగ్గర గోధుమ గడ్డి రసం, గోధుమగడ్డి పొడి అమ్ముతూ సంపాదిస్తున్నాడు. అంతేకాదు దాదాపు 30 మందికి పని కల్పించాడు కూడా. హైదరాబాద్​లో 25 కేంద్రాల్లో గోధుమ గడ్డి పెంచుతున్నాడు సత్యం.  

గోధుమ గడ్డి పెంచే పద్ధతి

చలికాలం, వానాకాలంలో కూడా విత్తడానికి అనువైన బన్సీరకం గోధుమలు  కొనాలి. ఏడు కుండీలు లేదా ట్రేలు తీసుకోవాలి. ఒక కుండీలో గోధుమ విత్తనాల్ని నానబెట్టాలి. రెండు మూడు రోజుల్లో మొలకలు వస్తాయి. ఈ మొలకల్ని  ఏడు కుండీల్లో నాటాలి.  గోధుమ గడ్డి తొందరగా పెరగాలంటే ఎండ, వేడిగాలి తగలకుండా చూసుకోవాలి. వారం రోజుల్లో గోధుమ గడ్డి కోతకు వస్తుంది. గడ్డి కోసిన తర్వాత ఖాళీ కుండీల్లో మళ్లీ గోధుమ మొలకల్ని నాటుకోవచ్చు. గోధుమ గడ్డిని మిక్సీలో గ్రైండ్ చేసి, ఫిల్టర్​ చేస్తే గోధుమ గడ్డి రసం వస్తుంది. 20 గ్రాముల గోధుమ గడ్డి నుంచి 70మిల్లీ లీటర్ల జ్యూస్ వస్తుంది.  దీని ధర 40 రూపాయలు.  వంద గ్రాముల గోధుమ గడ్డి పొడి ప్యాకెట్ ధర 450 రూపాయలు.  

బరువు తగ్గడానికి కూడా

‘‘గోధుమ గడ్డి రసంలో ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉంటాయి. గోధుమ గడ్డి రసం తాగితే ఒత్తిడి, శ్వాససంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు రావు. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా  పనిచేస్తుంది. రోజూ 1500 మంది గోధుమ గడ్డి రసం కొనుక్కుని వెళ్తున్నారు. ఈ రసాన్ని పరగడుపున తాగితే ఆరోగ్యానికి మంచిది’’.

రాపల్లి సత్యం

 – టి. రాజశేఖర్, కడెం, వెలుగు