ఇంట్లో నుంచే లెర్నింగ్​ లైసెన్స్​

ఇంట్లో నుంచే లెర్నింగ్​ లైసెన్స్​
  • త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు
  • టీఆర్ టైం పీరియడ్ నెల నుంచి 6 నెలలకు పెంపు!

హైదరాబాద్‌‌, వెలుగు: లెర్నర్స్‌‌  లైసెన్స్‌‌  రిజిస్ట్రేషన్‌‌ (ఎల్‌‌ఎల్‌‌ఆర్‌‌),  లైసెన్స్‌‌ రెన్యువల్‌‌ కోసం ఇబ్బందులు పడుతున్నారా? నేరుగా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లినా పని కావడం లేదా? అయితే, త్వరలోనే ఈ కష్టాలకు చెక్‌‌ పడనుంది. ఇంటి నుంచే ఆన్​లైన్​లో ఎల్‌‌ఎల్‌‌ఆర్‌‌ తీసుకునే ఆప్షన్‌‌ అందుబాటులోకి రానుంది. అప్లికేషన్‌‌ నుంచి ఎల్‌‌ఎల్‌‌ఆర్‌‌  ప్రింటింగ్‌‌ వరకు ఇంట్లోనే పొందొచ్చు. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలు త్వరలో  అందుబాటులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆన్‌‌లైన్‌‌లోనే ట్యుటోరియల్ ద్వారా ఎల్​ఎల్​ఆర్​ టెస్ట్‌‌  పెడుతారు. ఆన్​లైన్​లో అప్లయ్​ చేసుకున్న  ఏడు రోజుల్లోపు ట్యుటోరియల్‌‌ కంప్లీట్‌‌ చేయాలి. ట్యుటోరియల్‌‌లో డ్రైవింగ్‌‌ సిగ్నల్స్‌‌, ట్రాఫిక్  సింబల్స్‌‌, రోడ్డు రూల్స్‌‌, రెగ్యులేషన్స్‌‌పై ఇన్ఫర్మేషన్‌‌ ఉంటుంది. ఏదైనా వాహనం ప్రమాదానికి గురైనప్పుడు, ప్రమాదంలో చిక్కినప్పుడు అందులోని ప్రయాణికులకు ఎలాంటి సాయం చేయాలి? ఎలా తప్పించాలి? అనేది కూడా ఇందులో ఉంటుంది. రైల్వే క్రాసింగ్‌‌ దాటేటప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి, డ్రైవింగ్‌‌ చేసేటప్పుడు ఉండాల్సిన డాక్యుమెంట్ల గురించి వివరిస్తుంది. అటు తర్వాత ఎల్​ఎల్​ఆర్​ టెస్టు ఆన్​లైన్​లోనే నిర్వహిస్తారు. ఇందులో అడిగే ప్రశ్నలకు 60 శాతం కరెక్ట్​గా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇక లైసెన్స్‌‌ రెన్యువల్‌‌ ప్రాసెస్‌‌ కూడా అంతా ఆన్‌‌లైన్‌‌లోనే ఉంటుంది.

ఆరు నెలల దాకా టీఆర్‌‌ గడువు!
టెంపరరీ రిజిస్ట్రేషన్‌‌(టీఆర్‌‌)లో కూడా పలు మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం నెల వరకు మాత్రమే దీని గడువు ఉంది. కొత్త రూల్స్​ వస్తే  టీఆర్‌‌ టైం పీరియడ్‌‌ ఆరు నెలలకు చేరుతుంది. అయితే ఇది బాడీ బిల్డింగ్‌‌ బండ్లకు మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. బాడీ బిల్డింగ్‌‌ కింద లారీలు, బస్సులు, ట్రక్కులు లాంటి పెద్ద వాహనాలు వస్తాయి. అదే విధంగా వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌‌ ఆఫ్‌‌ సర్టిఫికెట్‌‌(ఆర్‌‌సీ) జారీలో రూల్స్‌‌ మార్చనున్నారు. ఆర్సీ వ్యాలిడిటీ కంటే రెండు నెలల ముందే రెన్యువల్‌‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం వ్యాలిడిటీ పూర్తయిన తర్వాత రెన్యువల్​ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొత్త రూల్స్​కు సంబంధించి ఇటీవల కేంద్ర రవాణా శాఖ డ్రాఫ్ట్‌‌ నోటిఫికేషన్‌‌ రిలీజ్‌‌ చేసింది. దీన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.