కుల, వర్గ విభేదాలు లేవ్.. అందరం ఒకటే : కేంద్ర మంత్రి సాధ్వీ

కుల, వర్గ విభేదాలు లేవ్.. అందరం ఒకటే : కేంద్ర మంత్రి సాధ్వీ
  • గణేశ్ ​శోభాయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉంది

హైదరాబాద్, వెలుగు: మనలో కుల, వర్గ విభేదా లు లేవని, మనమందరం ఒక్కటేనని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి అన్నారు. దేశ సంస్కృతి ఉట్టి పడేలా కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ ను నిర్మించిందని ఆమె గుర్తుచేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్ లో ఏర్పాటు చేసిన వినాయక స్వాగత వేదికలో ఆమె పాల్గొన్నారు. చార్మినార్ వైపు నుంచి హుస్సేన్ సాగర్ వైపు వచ్చిన వినాయకుడి​ప్రతిమలపై పూలు చల్లుతూ సాధ్వీ స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2012లో తాను ఎమ్మెలేగా శోభాయాత్రలో పాల్గొన్నానని, చాలా ఏండ్ల తర్వాత మళ్లీ పాల్గొనగడం సంతోషాన్ని కలిగించిందన్నారు. రామ మందిరం కడతామని ప్రకటించి.. కట్టి చూపించామన్నారు. వచ్చే ఏడాది జనవరి 2న అయోధ్య రామమందిరాన్ని దర్శించుకోవచ్చన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రామమందిరం నిర్మించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. 

రజాకార్లు భారత సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ప్రయత్నించి కాలగర్భంలో కలిసిపోయారని, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారు కూడా కాలగర్భంలో కలిసిపోతారని ఆమె హెచ్చరించారు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి మనమందరం కంకణబద్ధులై ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంజే మార్కెట్ కు వచ్చిన కేంద్ర మంత్రికి ఉత్సవ కమిటీ చైర్మన్ భగవంతరావు, నేత రామరాజులు ఘన స్వాగతం పలికారు.

 గత ఏడాది ఇదే వేదికపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతున్న సమయంలో గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ చార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్ మైక్ లాక్కున్న విషయం తెలిసిందే. ఈ సారి అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.