
న్యూయార్క్: ఇటలీ స్టార్ ప్లేయర్లు సారా ఎరానీ–ఆండ్రియా వావసోరి.. యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. గురువారం జరిగిన ఫైనల్లో ఎరానీ–వావసోరి 6–3, 5–7 (10/6)తో మూడోసీడ్ ఇగా స్వైటెక్ (పోలెండ్)–కాస్పర్ రుడ్ (నార్వే)పై గెలిచారు. గంటా 32 నిమిషాల మ్యాచ్‌లో ఇటలీ ద్వయం సర్వీస్‌ల్లో ఆకట్టుకుంది. బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో పాటు బేస్‌లైన్ గేమ్‌తో చెలరేగింది. మ్యాచ్ మొత్తంలో ఎరానీ–వావసోరి 4 ఏస్‌లు, రెండు డబుల్ ఫాల్ట్స్ చేశారు. తమ సర్వీస్‌లో 58 పాయింట్లు రాబట్టారు. ఐదు బ్రేక్ పాయింట్లలో మూడింటిని సద్వినియోగం చేసుకున్నారు.
25 విన్నర్లు, 12 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశారు. అదే టైమ్‌లో రెండు ఏస్‌లు మాత్రమే కొట్టిన స్వైటెక్–రుడ్ నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేశారు. తమ సర్వీస్‌లో కేవలం 39 పాయింట్లకే పరిమితమయ్యారు. వచ్చిన మూడు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నా.. 25 అన్ ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మూల్యం చెల్లించుకున్నారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఎరానీ–వావసోరి 4–2, 4–2తో అమెరికాకు చెందిన డానియెల్లె కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్‌పై, స్వైటెక్–రుడ్ 3–5, 5–3 (10/8)తో జాక్ డ్రేపర్ (బ్రిటన్)–జెస్సికా పెగులా (అమెరికా) గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఓవరాల్‌గా రెండు రోజుల్లో నాలుగు మ్యాచ్‌లు ఆడి టైటిల్ నెగ్గిన ఎరానీ–వావసోరికి రూ. 8 కోట్ల 72 లక్షల ప్రైజ్‌మనీ లభించింది.