కార్పొరేట్ల కోసం ప్రజలపై యుద్ధం చేస్తరా?

కార్పొరేట్ల కోసం ప్రజలపై యుద్ధం చేస్తరా?
  • కేంద్రంపై లెఫ్ట్​ పార్టీలు, శాంతి చర్చల కమిటీ నేతల ఫైర్​
  • వ్యక్తులు చనిపోతే సంబురాలు చేసుకుంటరా?: జస్టిస్ చంద్రకుమార్
  • మావోయిస్టుల మృతదేహాలను అప్పగించకపోవడం అమానవీయం: కూనంనేని
  • కేంద్రం చర్చలు జరపాలి: ప్రొఫెసర్​ హరగోపాల్​ 


హైదరాబాద్, వెలుగు: అన్ని ధర్మాలను వదిలేసి అధర్మ యుద్ధంలో మావోయిస్టులను చంపుతున్నదని, దీన్ని విజయంగా భావించడం సిగ్గుచేటని కేంద్రంపై వామపక్షాల నాయకులు, శాంతి చర్చల సంఘం నేతలు మండిపడ్డారు. ఎన్ కౌంటర్​లో మరణించిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో ఆరుగురి మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పోలీసులే దహనం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఇప్పటికైనా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ లోని​హిమాయత్ నగర్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ,  వామపక్షాల నేతలు, శాంతి చర్చల కమిటీ నాయకులు జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న చరిత్ర ఎక్కడా లేదని, వ్యక్తులు చనిపోతే సంబురాలు చేసుకోవడం బీజేపీ పాలకులకు మాత్రమే చెల్లిందని మండిపడ్డారు. రాముడి భక్తులమని చెప్పే బీజేపీ నాయకులకు అసలు రామాయణం గురించి తెలుసా? అని ప్రశ్నించారు. తెలియకపోతే వాల్మీకి రామాయణం చదవాలని సూచించారు.  హిందుత్వం పేరుతో తిరిగే బీజేపీ పాలకులు.. ఏధర్మం ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను దహనం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డెడ్​బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం దుర్మార్గమని అన్నారు.

చర్చలకు ఎందుకు వెనుకడుగేస్తున్నారు?: ప్రొఫెసర్​ హరగోపాల్​

మావోయిస్టుల మృతదేహాలను అప్పగిస్తే స్థానిక రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్య వస్తుందని కేంద్రం ప్రకటించిందని, అంటే మావోయిస్టుల ఉద్యమానికి మద్దతు ఉన్నట్లే కదా? అని ప్రొఫెసర్​హరగోపాల్ అన్నారు.​ మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు. అభివృద్ధి,  ప్రజల కోసమైతే కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరిపేదని, వారి ఆరాటం కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమేనని ఆరోపించారు. 

ఆదివాసీ మహిళలను, మావోయిస్టులను చంపి కేంద్ర బలగాలు నృత్యాలు చేస్తుంటే మోదీ, అమిత్​షా సంబురాలు చేసుకోవడం ఏమిటని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానీ వెస్లీ మండిపడ్డారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించకుండా మావోయిస్టులను చంపేసి  అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కేంద్రం కుట్రలు చేస్తున్నదని అన్నారు.. సమావేశంలో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, వామపక్షాల నేతలు మురహరి,  హన్మేశ్​, జానకిరాములు, వనం సుధాకర్, శాంతి చర్చల సంఘం నేతలు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి: కూనంనేని 

ఎన్ కౌంటర్​లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా.. పోలీసులే దహనం చేయడం అమానవీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్​ అయ్యారు. సుప్రీం కోర్టు వీటిని సుమోటోగా స్వీకరించి, న్యాయ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.  ఇది యుద్ధం కాదని, ఏకపక్షంగా  మావోయిస్టులను కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. ఏదో శత్రుదేశాలపై విజయం సాధించినట్లుగా మోదీ, అమిత్ షా సంబురాలు చేసుకోవడం ఏమిటని, అసలు మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. మావోయిస్టుల ఎన్ కౌంటర్ జరిగిన మరుసటి రోజే.. అటవీ భూమిని కేంద్ర అటవీ పర్యావరణశాఖ కార్పొరేట్ కంపెనీకి   ధారదత్తం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని బట్టి కేంద్ర వైఖరి స్పష్టమవుతున్నదని అన్నారు.