తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత చిక్కింది

తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత చిక్కింది

తిరుమల అలిపిరి మార్గంలో బాలికపై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం బాలికపై చిరుత దాడి చేసి చంపేయడంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు అలిపిరి నడక మార్గంలో బోను ఏర్పాటు చేశారు. గత రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన చిరుత బోనులో చిక్కింది. గత రెండు రోజుల్లో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. 

అలిపిరి మార్గంలో మూడు చిరుతలు సంచరిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిన్నారి లక్షితపై దాడి చేసింది ఆడ చిరుతగా గుర్తించమన్నారు. రాత్రి బోనులో చిక్కింది కూడా ఆడ చిరుతనే అని ధర్మారెడ్డి పేర్కొన్నారు. పబ్లిక్ వ్యూ పాయింగ్ నామాల బావి దగ్గర చిరుత బోనులో చిక్కిందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

శుక్రవారం అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చిరుత పులి దాడి చేయ‌డంతో ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న రాత్రి సమయంలో జ‌రిగింది. మ‌రో గంట ప్రయాణిస్తే తిరుమ‌ల‌కు చేరుకుంటామ‌నుకునే స‌మ‌యంలో ముందుగా వెళుతున్న బాలిక‌పై చిరుత పులి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌తో కుటుంబ స‌భ్యులు ఒక్కసారిగా నిర్ఘాంత‌పోయారు. తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌తో వారు కేక‌లు వేయ‌డంతో చిరుత బాలిక‌ను అడ‌విలోకి ఈడ్చుకెళ్లింది. 

శనివారం బాలిక మృతదేహాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఘటనపై సీరియస్ గా తీసుకున్న తిరుమల దేవస్థానం.. చిరుత ను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. అలిపిరి నడక మార్గంలో రాత్రి సమయాల్లో  ఆంక్షలు విధించారు.