ఏడుకొండలపై.. మొదటిసారి తిరుమల అలిపిరి కాలి బాటలో.. ఓ చిన్నారి భక్తుడు జంతువుల దాడిలో చనిపోవటం ఇదే. చిరుత పులి దాడిలో చనిపోయినట్లు కొందరు అంటుంటే.. కాదు కాదు ఎలుగుబంటి దాడి చేసిందని మరికొందరు అంటున్నారు. దీనిపై తిరుమల అధికారులు.. ఫారెస్ట్ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయటం లేదు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాతే అసలు వాస్తవం బయటకు వస్తుందని చెబుతున్నారు. ఘటన ఎలా జరిగింది.. కచ్చితంగా ఎన్ని గంటలకు జరిగింది.. ఆ సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు.. చిన్నారి అదృశ్యం సమయంలో ఎవరూ చూడకపోవటానికి కారణాలు ఏంటీ.. అనే ప్రశ్నలు ఎన్నో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. గతంలో చిరుత దాడి చేసినప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు.. స్థానికులు చూశారు.. వెంటనే అందరూ అలర్ట్ అయ్యారు.. ఇప్పుడు మాత్రం అలాంటిది ఏమీ లేకపోవటం ఏంటీ అనే ప్రశ్నలు సహజంగా రావటం.. అనుమానాలకు తావిస్తోంది.
ఇంతకీ చిన్నారిపై దాడి చేసింది చిరుత పులా లేక ఎలుగుబంటా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే.. ఏ జంతువు అయినా దాడి చేసి ఉంటే.. పాప ఏడుపు వినాలి కదా చుట్టుపక్కల వాళ్లు.. అలిపిరి మెట్ల మార్గానికి పక్కనే.. కొంత దూరంలో చిన్నారి మృతదేహం లభ్యం అయ్యింది. అంత దూరం ఓ చిరుత లేక ఎలుగుబంటి తీసుకెళుతుంటే ఇన్నారి ఏడవ లేదా.. అరవలేదా.. ఎందుకంటే పాప వయస్సు ఆరేళ్లు.. భయంతో అరవటం అనేది కామన్. ఓ జంతువు.. ఆరేళ్ల పాపను అంత దూరం తీసుకెళుతుంది అంటే ఎలాంటి చడీచప్పుడు తల్లిదండ్రులు వినకపోవటం ఏంటీ.. ఎందుకు ఎవరూ చూడలేదు అని చెబుతున్నారు అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అధికారులు, పోలీసు ఆఫీసర్లు, ఫారెస్ట్ సిబ్బంది.
చనిపోయిన చిన్నారి శరీరంపై కొన్ని గాయాలు ఉన్నాయని.. అవి జంతువు చేసినట్లే ఉన్నాయని.. అయితే అది చిరుత పులా లేక ఎలుగుబంటి దాడి చేసిందా అనే కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అలిపిరి మార్గంలో నిత్యం 25 వేలు నుంచి 30 వేల మంది భక్తులు నడిచివెళుతుంటారు. ప్రతిచోటా భక్తులు కనిపిస్తూనే ఉంటారు. ఇక నరసింహస్వామి ఆలయం దగ్గర అంటే.. అక్కడికి వచ్చిన భక్తులు.. కచ్చితంగా కొంత సేపు విశ్రాంతి అయితే తీసుకుంటారు. అలాంటి ఆలయం వెనక భాగంలోనే.. ఓ చిన్నారి మృతదేహం కనిపించటం.. అది కూడా ఎవరూ ఎలాంటి అలికిడి కానీ.. చప్పుడు కానీ వినకపోవటం ఏంటనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది..