
- బోన్లకు చిక్కకపోవడంతో భయాందోళనలో ప్రజలు
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, గండిపేట మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలకు కనిపించింది. వారి ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలతోపాటు 4 బోన్లు ఏర్పాటు చేశారు. అయినా ఆ చిరుత చిక్కకపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గోల్కొండ ప్రాంతంలో సోమవారం వేకువజామున ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో లంగర్ హౌస్, నార్సింగి వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
తారామతి మీదుగా మూసీనది వైపు వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై గోల్కొండ పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారంతో హైదరాబాద్లోని మూసీ నది పరివాహక గోల్కొండ, లంగర్ హౌస్, జియాగూడ తదితర ప్రాంతాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని త్వరలోనే చిరుతను పట్టుకుంటామని అధికారులు తెలిపారు.