
- టెక్నికల్ సమస్యలతో వాహన యజమానులకు ఇబ్బందులు
- డాక్యుమెంట్లు, ఫొటోల అప్ లోడింగ్ కోసం గంటల తరబడి వెయిటింగ్
- పౌర సేవలపై భారీగా చార్జీలు పెంచిన అధికారులు
- ఆదాయంపై ఉన్న శ్రద్ధ సేవల విషయంలో లేదని విమర్శలు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి చెందిన రవాణా శాఖ పోర్టల్ ‘సారథి’ వాహన యజమానులకు చుక్కలు చూపిస్తోంది. వారం కిందటే రవాణా శాఖకు సంబంధించిన అన్ని రకాల పౌర సేవలపై చార్జీలను భారీగా పెంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగే దిశగా చర్యలు చేపట్టిన అధికారులు.. వాహన యజమానులకు అందించే ఆన్ లైన్ సేవల విషయంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇటీవలే రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ‘సారథి’ పోర్టల్ తో అనుసంధానమై, వాహన యజమానులకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ (లర్నింగ్, పర్మనెంట్), రెన్యువల్, ఇంటి అడ్రస్ మార్పు.. వంటి వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆన్ లైన్ లోనే అప్‌డేట్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఇటీవలే ఈ పోర్టల్ సారథిని అమల్లోకి తీసుకువచ్చారు. నిర్ణీత ఫీజు ఆన్ లైన్ లోనే చెల్లించి ఈ సేవలను పొందవచ్చని ప్రకటించారు. రెండు నెలల కిందట ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో అమలు చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ పోర్టల్ ద్వారానే రవాణా సేవలు అందిస్తున్నారు. ప్రతి చిన్న పని కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టు తిరగడం, బ్రోకర్లను ఆశ్రయించి పనులు చేయించుకోవడంతో ఆర్టీఏపై అవినీతి ముద్ర పడుతుందని అధికారులు పారదర్శకంగా సేవలు అందించేందుకు దీన్ని అమలు చేస్తున్నారు. అయితే తరచూ సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో చిన్న పని కోసం గంటల తరబడి ఆన్ లైన్ లో నిరీక్షించాల్సి వస్తోందని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.
సంబంధిత డాక్యుమెంట్లు, ఫొటోలను సారథిలో అప్ లోడ్ చేసుకోవాలన్నా గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. దీంతో ఆన్ లైన్ సేవల కన్నా నేరుగా ఆఫీసుకు వెళ్లి పనులు చేయించుకోవడం మేలనే అభిప్రాయానికి వచ్చారు. దీనిపై రవాణా శాఖ అధికారులను వివరణ కోరగా... కొత్త పోర్టల్‌తో సాంకేతిక సమస్యలు సహజమేనని అన్నారు. వాహనదారులు తమ దృష్టికి సమస్యను తీసుకొస్తే వెంటనే సరిచేస్తున్నామని చెప్పారు. ఈ పోర్టల్ అమలుపై తమ ఉద్యోగులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.