
ప్రముఖ కన్నడ థియేటర్ ఆర్టిస్ట్ మరియు నటుడు టి ప్రభాకర్ కళ్యాణి కన్నుమూశారు. ఇవాళ శుక్రవారం (ఆగస్టు 8న) ఉడిపిలోని హిరియడ్కలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఐదు సంవత్సరాల క్రితమే ప్రభాకర్కు గుండె ఆపరేషన్ జరగగా..వైద్యులు అతనికి స్టెంట్ అమర్చినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. నటుడు ప్రభాకర్ మూడు రోజుల క్రితం ఉడిపిలోని హిరియడ్క పట్టణంలో తలతిరుగుతూ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత చికిత్స తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 8:30 గంటల ప్రాంతంలో, తన చేతులు మరియు కాళ్ళలో నొప్పి ఉందని ప్రభాకర్ తన భార్యకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతుండగానే, హఠాత్తుగా కుప్పకూలి తుది శ్వాస విడిచారని వారు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం బీడినగుడ్డె శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.
నటుడు టి ప్రభాకర్ కళ్యాణి పెర్డూర్‌కు చెందినవారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. నాటకరంగం పట్ల మక్కువ ఉన్న ప్రభాకర్ వివిధ రంగస్థల నాటకాల్లో చురుగ్గా నటించాడు. కాంతారా సినిమాలోని మహాదేవ (న్యాయవాది పాత్ర) పోషించి ప్రసిద్ధి చెందారు.
కాంతారా వరుస ప్రమాదాలు:
కాంతారా 2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి పలు వరుస ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. కన్నడ హాస్యనటుడు రాకేష్ పూజారి 33 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. దానికంటే ముందు మళయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఉడిపి జిల్లా బైందూర్లోని కొల్లూరులో జరిగింది. ఇటీవలే, కాంతారా 2లో నటిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు నటుడు టి ప్రభాకర్ కళ్యాణి ఇంట్లోనే హఠాత్తుగా కుప్పకూలి పోవడం.
ఇవేగాక.. సినిమా షూటింగ్ మొదట్లో కొల్లూరులోనే జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు సడెన్ గా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. అందులో కొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఓ సారి గాలి వాన రావడం వల్ల నిర్మించిన భారీ సెట్ కూలిపోయింది. అప్పుడు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ వరుస విషాదాలు చూస్తుంటే.. కాంతారా మేకర్స్ తో పాటుగా.. కన్నడ ఇండస్ట్రీని భయాందోళనకు గురిచేస్తున్నాయి.