
న్యూఢిల్లీ, వెలుగు: మెడికల్ అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకువచ్చిన జీఓ 33ను తప్పకుండా అమలు చేయాలని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ చారి, కార్యదర్శి రమేశ్ కుమార్ పొడిశెట్టి, సుప్రీంకోర్టు అడ్వకేట్ రమేశ్ విశ్వనాథుల, తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పద్మా చారి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో మెడికల్ అడ్మిషన్లలో గతంలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న ఏడేండ్లలో ఏవైనా నాలుగేండ్లు తెలంగాణలో చదివిన వారిని లోకల్ గా పరిగణించేవారని తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో చదవకపోయినా.. 6,7,8,9 తరగతులు చదివినట్టు తప్పుడు స్టడీ సర్టిఫికెట్ల ద్వారా స్థానికంగా మెడికల్ అడ్మిషన్స్ తీసుకోవడాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు.
ఈ విషయంలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విశాల దృక్పథంతో ప్రభుత్వం జీవో 33ను తీసుకొచ్చిందని వివరించారు. గతేడాది 2024–25 అడ్మిషన్స్ సమయంలో కొంతమంది కోర్టుకు వెళ్లగా.. హైకోర్టు, సుప్రీంకోర్టులలో జీఓ 33 పై వాదనలు జరిగాయని పేర్కొన్నారు. చివరి దశలో అడ్మిషన్స్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం అందరినీ నీట్‌యూజీ-2024 కౌన్సెలింగ్ కి అనుమతించిందన్నారు.
ఈ క్రమంలో జీఓ 33 ప్రకారం స్థానికేతరులు 135 మంది కోర్టును ఆశ్రయించి, తెలంగాణ అడ్మిషన్స్ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. ఈ అభ్యర్థులలో దాదాపు 86 మంది ఏ క్యాటగిరీలో ఎంబీబీఎస్ సీట్లు పొందారని, కొంతమంది బీ క్యాటగిరీలో, కొందరు బీడీఎస్ లో జాయిన్ అయ్యారని చెప్పారు. ఇలా దాదాపు 120పైగా తెలంగాణేతర విద్యార్థులు మెడికల్ సీట్లు పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఒక్కరు కూడా తెలంగాణలో ఒకటో తరగతి చదవలేదని.. అంతా ఇతర రాష్ట్రాలు, దేశాలలో చదివారని తెలిపారు.
దీంతో నిజమైన తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వివరించారు. అయితే, 2025–26 మెడికల్ అడ్మిషన్లలో జీఓ 33 తప్పకుండా అమలు చేస్తారని తెలంగాణ నుంచి నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ల తల్లిదండ్రులం భావించామని.. కానీ, ప్రస్తుతం ఈ అంశంపై మళ్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో విచారణ జరుగుతున్నదని తెలిపారు. ఇకనైనా ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ కోసం జీఓ33ని తీసుకువచ్చారో? ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోర్టుల అనుమతితో తప్పకుండా జీఓ అమలయ్యేలా చూసి, తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.