
- ఇండియా ఇచ్చే డబ్బులతోనే చేస్తున్నదా?
- ట్రంప్ వైఖరిపై మండిపడిన కాంగ్రెస్ నేత శశిథరూర్
- అమెరికాకు దీటుగా బదులివ్వాలి
- ఇప్పుడున్న 17% టారిఫ్‌ను 50 శాతానికి పెంచాలని కామెంట్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై చేస్తున్న కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. ట్రంప్‌కు దీటుగా ఇండియా వ్యవహరించాలని కోరారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో థరూర్ సంచలన కామెంట్లు చేశారు. ‘‘రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటున్నది. దీని ద్వారా వచ్చిన డబ్బులను ఉక్రెయిన్‌పై దాడికి రష్యా వాడుతున్నదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అదే రష్యా నుంచి అమెరికా కూడా ఆయిల్, యురేనియం, పల్లాడియం, ఫర్టిలైజర్స్ కొంటున్నది. మరి ట్రంప్ చెల్లించే డాలర్లను రష్యా ఏం చేస్తున్నట్లు? ఇండియా చెల్లించే డబ్బులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్నదనడం సరికాదు.
ఇండియా కంటే చైనా భారీగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది. మరి చైనాపై లేని ఆంక్షలు ఇండియాపై ఎందుకు? టారిఫ్ విషయంలోనూ చైనాకు 90 రోజుల పాటు వెసులుబాటు కల్పించిన ట్రంప్.. ఇండియాపై సుంకాలను వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. ట్రంప్‌ది బెదిరింపు ధోరణి. ఇండియాను ఉద్దేశిస్తూ ‘డెడ్ ఎకానమీ’అనే ట్రంప్ కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. ట్రంప్ కామెంట్లు.. దేశ ఆర్థిక వృద్ధిని తక్కువ చేసే ప్రయత్నంగా భావిస్తున్నాం.
ట్రంప్ చేసే కామెంట్లు.. దేశ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ బెదిరింపులకు ఇండియా లొంగొద్దు. ఇండియా కూడా అమెరికా వస్తువులపై 50 శాతం టారిఫ్ అమలు చేయాలి’’అని శశిథరూర్ అన్నారు. అమెరికా వస్తువులపై ఇండియా 17 శాతం టారిఫ్ మాత్రమే విధిస్తున్నదని తెలిపారు. అమెరికా వ్యవహరిస్తున్న తీరుగా తగ్గట్టు ఇండియా సమాధానం ఉండాలని కేంద్రాన్ని కోరారు. అమెరికా మార్కెట్‌పై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలన్నారు.