ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 179 మందికి ప్రమోషన్లు

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 179 మందికి ప్రమోషన్లు
  •  46 మంది ఈఈలకు ఎస్ఈలుగా.. 123 మంది ఏఈఈలకు 
  • డీఈఈలుగా పదోన్నతులు

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ శాఖలో ప్రభుత్వం భారీగా ప్రమోషన్లను కల్పించింది. తెలంగాణ వచ్చాక ఎన్నడూ లేనివిధంగా 179 మంది అధికారులకు పదోన్నతులు ఇచ్చింది. వాస్తవానికి ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడే 33 ఏండ్లుగా అధికారులు ప్రమోషన్లు లేకుండానే పనిచేస్తున్నారు. తాజాగా డిపార్ట్​మెంట్​ను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ​సర్కార్  ప్రమోషన్ల ప్రక్రియపై దృష్టి సారించింది. అందులో భాగంగానే డిపార్ట్​మెంటల్​ప్రమోషన్​ కమిటీ (డీపీసీ)లను క్లియర్​ చేస్తూ ప్రమోషన్లను ఇస్తున్నది. రెండ్రోజుల క్రితం 8 మంది ఎస్ఈలకు సీఈలుగా ప్రమోషన్​ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. తాజగా 46 మంది ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్లకు (ఈఈ) సూపరింటెండెంట్​ ఇంజనీర్లుగా (ఎస్ఈ), 123 మంది ఏఈఈలకు డీఈఈలుగా పదోన్నతులు కల్పించింది. 

ఈ మేరకు శుక్రవారం ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. ప్రమోషన్లు పొందిన అధికారులు 15 రోజుల్లోగా రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.  కాగా, 2008 బ్యాచ్​కు చెందిన 127 మంది ఏఈఈలకు వివిధ కారణాలతో 17 ఏండ్లుగా ప్రమోషన్లు దక్కలేదు. దీంతో ప్రమోషన్ల కోసం ఏఈఈలు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు.  127 మందిలో 123 మందికి ప్రమోషన్​ఆర్డర్లను రిలీజ్​ చేసింది. కోర్టు కేసుల కారణంగా మిగతా నలుగురి ప్రమోషన్లను ప్రభుత్వం హోల్డ్​లో పెట్టినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఇద్దరికి ఈఎన్సీలుగా, 8 మందికి సీఈలుగా, 46 మందికి ఎస్ఈలుగా, 123 మందికి డీఈఈలుగా ప్రమోషన్లు రాగా.. మొత్తంగా 179 మందికి సర్కారు ప్రమోషన్లు ఇవ్వడం విశేషం.

గతంలో అందని ద్రాక్షగా ప్రమోషన్లు..

గతంలో ప్రమోషన్లు అందని ద్రాక్షగానే ఉండేదని అసోసియేషన్​ ఆఫ్​ తెలంగాణ అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్స్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్​, హైదరాబాద్​ ఇంజినీర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్, సభ్యులు అన్నారు. పదోన్నతి పొందడంలో అడుగడుగునా జీఓలు, జోనల్​ వ్యవస్థలు సవాళ్లుగా ఉండేవన్నారు. 17 ఏండ్లుగా డ్యూటీ చేస్తున్నా.. 2008 బ్యాచ్​ ఏఈఈలకు ప్రమోషన్లు రాలేదని, కానీ, ప్రజాప్రభుత్వం జీఓలను సవరిస్తూ, జోనల్​  వ్యవస్థలను సరిచేస్తూ ప్రమోషన్లు ఇచ్చిందని తెలిపారు. అన్నేండ్ల కలను కాంగ్రెస్​సర్కారు నిజం చేసిందన్నారు. డీఈఈలుగా ప్రమోషన్ ​పొందిన ఏఈఈలు మేఘావత్​ శ్రీనివాస్, శివకుమార్, శ్రీనివాస్​ నాయక్, కిరణ్​ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.