బీసీ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి

బీసీ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి
  • గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుకు బీసీ సంఘాల విజ్ఞప్తి

 హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయిలో బీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని గోవా గవర్నర్ అశోక్‌‌ గజపతిరాజుని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్‌‌‌‌ రావు విజ్ఞప్తి చేశారు . శుక్రవారం గోవాలోని రాజ్ భవన్‌‌లో అశోక్ గజపతిరాజుని బీసీ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బీసీ డిమాండ్లకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు. 2026 నుంచి దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో సమగ్ర కులగణను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. 

అలాగే, చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. అనంతరం బీసీ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. గవర్నర్‌‌‌‌ను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ఏపీ ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ ఉన్నారు.