చుడిదార్లో ఉన్నానని ఆపేశారు.. రెస్టారెంట్ ముందు దంపతుల వీడియో.. సీఎం ఫైర్

చుడిదార్లో ఉన్నానని ఆపేశారు.. రెస్టారెంట్ ముందు దంపతుల వీడియో.. సీఎం ఫైర్

మనలో చాలా మంది  వీకెండ్ లేదా పండగ రోజుల్లో ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్తుంటారు. అయితే మీరు మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో  కలిసి సంప్రదాయ దుస్తులలో రెస్టారెంట్‌కి వెళ్తే అక్కడ తినడానికి కూడా డ్రెస్ కోడ్ ఉండాలి అని రూల్ పెడితే మీకు ఎం అనిపిస్తుంది. ఇది  రెస్టారెంటా లేక ఆఫీసా అని అనుకుంటారు కదా.. కానీ రెస్టారెంట్‌లో కూడా తినడానికి డ్రెస్ కోడ్ పెట్టడం అనేది అసలు అర్థం లేనిది. 

ఢిల్లీలో ఉంటున్న ఓ జంట రెస్టారెంట్‌లో తినడానికి వెళ్తే ఇలాగే జరిగింది, కేవలం భారతీయ దుస్తులు వేసుకున్నందుకు వారిని లోపలికి రానివ్వలేదు.

వివరాలు చుస్తే  ఈ సంఘటన ఢిల్లీలోని పితంపురలోని తుబాటా రెస్టారెంట్‌లో జరిగింది. ఒక జంట అక్కడికి డిన్నర్ చేసేందుకు   వెళ్లగా, వాళ్ళు సాంప్రదాయ దుస్తులు ధరించారని లోపలి  వెళ్లనివ్వలేదు. ఓ మహిళ కుర్తీ, పైజామా, దుపట్టా ధరించగా ఆమె భర్త సాధారణ టీ-షర్ట్ & జీన్స్ ధరించాడు. కానీ బయట ఉన్న రిసెప్షనిస్ట్ వారిని లోపలికి వెళ్లనివ్వలేదు.

ఆ జంట రెస్టారెంట్ బయట నిలబడి నిరసన తెలిపారు. భారతదేశంలో ఉండే ప్రజలు భారతీయ దుస్తులు ధరించి రెస్టారెంట్లలో తినకుండా నిషేధించారని,  ఇలాంటి రూల్ భారతీయ సంస్కృతికి విరుద్ధమని ఆగ్రహించారు. ఆ తర్వాత రెస్టారెంట్ మేనేజర్ బయటకు వచ్చి రిసెప్షనిస్ట్ ప్రవర్తనకు క్షమాపణలు చెప్పారు.

 రెస్టారెంట్ బయట వీడియో: ఈ సంఘటన తర్వాత రెస్టారెంట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వీడియోను @rose_k01 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షలకు పైగా చూసారు.

►ALSO READ | కొత్త ఐటీ బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం.. సడన్గా ఈ యూటర్న్ ఎందుకంటే..

అయితే ఈ రెస్టారెంట్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  మన సంస్కృతికి విరుద్ధమైన ఇలాంటి రెస్టారెంట్లను మూసేయాలి అంటూ ఒకరు,  సాంప్రదాయ బట్టలు  ధరించి తినడానికి వస్తే అది వాళ్ళ ఇష్టం  అని మరొకరు ఇలా కొంతమంది రెస్టారెంట్ పై విమర్శలు కురిపించారు. 

ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఈ విషయంపై స్పందించి దర్యాప్తు చేసి  చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తరువాత రెస్టారెంట్ క్షమాపణలు చెప్తూ, ఇక ముందు బట్టల పై ఎటువంటి రూల్స్ ఉండవని తెలిపింది.