
- లబ్ధిదారులకు తీరనున్న బ్యాంకింగ్ కష్టాలు
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు విడుదల చేసే బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఈ చెల్లింపులను ఆధార్ అనుసంధాన ప్రక్రియ(ఆధార్ పేమెంట్ బిల్ సిస్టం) ద్వారా నిర్వహించనున్నామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ శుక్రవారం తెలిపారు. విడతల వారీగా విడుదల చేస్తున్న బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడటంలో ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరగడం లేదన్న ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయన్నారు. ఇటీవలి కాలంలో లబ్ధిదారుల నుంచి తమకు విడుదలైన బిల్లుల మొత్తాలు ఖాతాల్లో జమ కావడం లేదన్న ఫిర్యాదులు రావడంతో ఈ అంశాన్ని లోతుగా పరిశీలించారు.
లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ల వివరాల నమోదులో పొరపాట్లు, ఐఎఫ్ఎస్ సీ కోడ్ లలో తప్పులు, వినియోగంలో లేని అకౌంట్ నంబర్లు, మొదలైన కారణాలతో ఇబ్బందులు వస్తున్నాయన్న ఫిర్యాదులను పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్న లక్ష్యంతో, ఆధార్ ఆధారితంగా చెల్లింపులు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా 9,100 మంది లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపులు చేయగా, వాటిలో 9,000 వరకు ఎటువంటి సమస్య లేకుండా జరిగాయి. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ వేగవంతంగానూ, సమస్యలు లేకుండానూ కొనసాగేలా చూడటానికి ఇకపై అన్ని చెల్లింపులను ఆధార్ ఆధారంగానే చేపట్టనున్నామని ఎండీ వెల్లడించారు.