
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు ఏటికేడు కాంపిటీషన్ తగ్గుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల ఏర్పాటు వల్ల సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఒక్కో సీటుకు పోటీపడే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కో సీటుకు15 మందిపైనే పోటిపడేవారు. తెలంగాణ వచ్చాక కొత్తగా14 మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. దీంతో సీట్ల సంఖ్య డబుల్ అయింది. రాష్ట్రంలో ఒక్కో సీటుకు పోటి పడే వారి సంఖ్య నిరుడు ఏడుకు తగ్గింది. ఈసారి ఒక్కో సీటుకు ఆరుగురు మాత్రమే పోటీ పడనున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్‌లో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో12 వందల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంకో రెండు ప్రైవేటు కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఒక్క ఏడాదిలోనే మరో 15 వందల ఎంబీబీఎస్ సీట్లు పెరిగే చాన్స్ ఉంది. దీంతో పోటీ మరింత తగ్గనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 5,168 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 1,718, ప్రైవేట్‌లో 3,450 సీట్లు ఉన్నాయి. బీబీనగర్ ఎయిమ్స్‌లో మరో 50 సీట్లు ఉన్నాయి. ఈసారి రాష్ట్రం నుంచి 32,899 మంది మాత్రమే నీట్‌లో క్వాలిఫై అయ్యారు. దీంతో ఒక్కో సీటుకు పోటీ పడుతున్న స్టూడెంట్స్సంఖ్య ఆరుకు తగ్గింది.
ర్యాంక్ లక్ష దాటినా..
ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడంతో ఆలిండియా ర్యాంక్ లక్ష దాటిన వాళ్లకు కూడా సీట్లు దక్కే అవకాశం ఏర్పడింది. జాతీయ స్థాయిలో 60 వేల ర్యాంకు వచ్చినోళ్లకూ నిరుడు ఓపెన్ కేటగిరీలో సీటు దొరికింది. ఎస్సీ కేటగిరీలో 1.22 లక్ష ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1.01 లక్షల ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. బీసీ ఏ కేటగిరీలో 1.12 లక్షలు, బీసీ బీ కేటగిరీలో 65 వేల ర్యాంక్, బీసీ సీ కేటగిరీలో1.01 లక్ష ర్యాంక్ వరకు, బీసీ డీ కేటగిరీలో 66 వేలు, బీసీ ఈ కేటగిరీలో 93 వేల ర్యాంక్ వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 47 వేల ర్యాంక్, మైనారిటీ కేటగిరీలో 95 వేల ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈసారి ఇంకా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్లకు కూడా సీట్లు దొరికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కౌన్సెలింగ్ ఇలా..
గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు. దేశంలోని ఏ ప్రాంత స్టూడెంట్స్అయినా ఈ15 శాతం సీట్లకు పోటీ పడొచ్చు. జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు. ఎయిమ్స్ సీట్లను కూడా ఆలిండియా ర్యాంకుల ప్రకారమే కేటాయిస్తారు. నేషనల్ కోటాలో మన స్టేట్ నుంచి సుమారు 300 మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. నేషనల్ కోటాకు ఇచ్చిన15 శాతం సీట్లు పోగా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని అన్ని సీట్లను స్టేట్ లెవల్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పాటించాల్సి ఉంటుంది. నేషనల్ కోటా సీట్లు 230, ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు 203 ఉన్నట్టు సమాచారం.