పోక్సో కేసుల్లో శిక్షలు తక్కువే : కైలాస్​ సత్యార్థి

పోక్సో కేసుల్లో శిక్షలు తక్కువే : కైలాస్​ సత్యార్థి

హనుమకొండ, వెలుగు : దేశంలో చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని, కానీ శిక్షలు పడుతున్న కేసులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయని నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత కైలాస్​ సత్యార్థి అన్నారు. హనుమకొండలోని వరంగల్ డిస్ట్రిక్ట్​ కోర్ట్ కాంప్లెక్స్​ లో నిర్వహించిన జ్యుడీషియరీ ప్రోగ్రామ్​కు రాష్ట్ర హైకోర్ట్​ చీఫ్​ జస్టిస్​ ఉజ్జల్​ భుయాన్​, హైకోర్టు జడ్జి నవీన్​ రావు తో కలిసి చీఫ్​ గెస్ట్​ గా హాజరయ్యారు. ముందుగా వరంగల్ నిట్ ​క్యాంపస్​ కు చేరుకోగా సీపీ ఏవీ.రంగనాథ్​, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్​ గాంధీ హనుమంతు, డా.బి.గోపి, గ్రేటర్​ కమిషనర్​ ప్రావీణ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అక్కడి నుంచి వరంగల్ కోర్టు కాంప్లెక్స్​లో పిల్లల కోసం ఏర్పాటు చేసిన పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టు చైల్డ్ కేర్​సెంటర్లను పరిశీలించారు. తర్వాత జిల్లా జడ్జి కె.రాధాదేవి అధ్యక్షతన నిర్వహించిన జ్యుడీషియరీ సమావేశాన్ని చీఫ్ జస్టిస్​ ఉజ్జల్​ భుయాన్​, నోబెల్ గ్రహీత కైలాస్​సత్యార్థి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 

కరోనా టైంలో రెట్టింపు లైంగికదాడులు

బాలలపై మనసు చలించిపోయే ఘటనలు జరుగుతున్నాయని నోబెల్​ గ్రహీత కైలాస్​ సత్యార్థి అన్నారు. కరోనా టైంలో చిన్నారులపై లైంగిక దాడులు రెట్టింపయ్యాయన్నారు. ఇండియాలోనే కాదని, ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉందన్నారు. పెద్ద సంఖ్యలో పోక్సో కేసులు నమోదవుతుంటే, ఆ స్థాయిలో శిక్షలు లేవన్నారు. దేశంలో వేల కేసులు పెండింగ్​లో ఉంటే, కేవలం 2.5 శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయన్నారు. వరంగల్​ పోక్సో కోర్టులో 256 కేసులుంటే..146  డిస్పోజ్​చేశారని, 40  కేసుల్లో శిక్షలు పడ్డాయన్నారు. దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ పరిస్థితి మెరుగ్గా ఉందని అభినందించారు. దేశంలో పిల్లల కోర్టులను దేవాలయాలుగా పిలవాలన్నారు. బాలల హక్కుల దినోత్సవాలు జరగాలన్నారు. చిన్నారులపై దాడులకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయంతో పాటు బాధిత కుటుంబసభ్యులకు పరిహారం అందించాలన్నారు.  

రాష్ట్రంలో బాల కార్మికుల్లేరు : వినోద్​కుమార్​

రాష్ట్రంలో బాల కార్మికులు లేరని, వివిధ పనుల కోసం రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల పిల్లలే ఉన్నారని  రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​ కుమార్​ అన్నారు. వారి సంక్షేమం కోసం కూడా సర్కారు చర్యలు తీసుకుంటోందన్నారు. త్వరలోనే 36 బాల రక్షక్​ వాహనాలు  ఏర్పాటు చేయబోతున్నామని, పిల్లలకు ఏ సమస్య వచ్చినా ఆ వాహనాల్లో సిబ్బంది వచ్చి పరిష్కరిస్తారన్నారు. హైదరాబాద్​ లో మూడు , మిగతా జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున వెహికిల్స్​ఇస్తామన్నారు. మీటింగ్​కు జిల్లా జడ్జి రాధాదేవి సభాధ్యక్షత వహించారు. కుడా చైర్మన్​ సంగంరెడ్డి సుందర్​ రాజ్​యాదవ్​పాల్గొన్నారు.

నైతిక విలువలతో కూడిన న్యాయం అందించాలి

చట్టం అంటే నైతికత తప్ప మరొకటి కాదు. నైతిక విలువతో కూడిక న్యాయాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరముంది. సత్వర న్యాయం జరిగేందుకు ఇతర జిల్లాల్లో కూడా పోక్సో కోర్టులు విస్తరించాలి. బాల్య వివాహాలు జరగడానికి కుటుంబంలోని తల్లులు, బామ్మలే కారణమవుతున్నారు.  వారిలో కూడా అవగాహన తీసుకురావాలి. లైంగికదాడుల బాధితుల పేర్లు రాకుండా మీడియా జాగ్రత్తలు తీసుకోవాలి. కైలాస్​ సత్యార్థి వరంగల్ కు రావడం గర్వకారణం.  – ఉజ్జల్​ భుయాన్​, హైకోర్టు చీఫ్ ​జస్టిస్