19 వేల స్కూళ్లలో వందలోపే స్టూడెంట్లు

19 వేల స్కూళ్లలో వందలోపే స్టూడెంట్లు
  • 8,891 బడుల్లో 30కి లోపే రాష్ట్రంలో 17 స్కూళ్లలోనే 
  • వెయ్యి మందికిపైగా స్టూడెంట్లు
  • నామమాత్రంగా బడిబాట 
  • టీచర్ పోస్టులు భర్తీ చేస్తలే, సౌలతులు కల్పిస్తలే
  • ఇవేం లేకుండా అడ్మిషన్లు ఎట్లా పెరుగుతాయంటున్న విద్యావేత్తలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో ఏటా అడ్మిషన్లు తగ్గుతున్నాయి. 19 వేల బడుల్లో ఒక్కోదాంట్లో వంద లోపే స్టూడెంట్లు చదువుకుంటున్నారు. కేవలం 17 బడుల్లోనే వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది సర్కారు బడుల్లో 1.91 లక్షల మంది స్టూడెంట్లు చేరినట్లు స్కూల్​ ఎడ్యుకేషన్​ చెబుతున్నది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నా, దాని ప్రభావం అడ్మిషన్లపై కనిపించడం లేదు. ప్రభుత్వ స్కూళ్లపై పేరెంట్స్‌‌లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టకుండా, టీచర్ల ఖాళీలను భర్తీ చేయకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఉపయోగం లేదని విద్యావేత్తలు చెప్తున్నారు.

లెక్కల్లో తప్పులు

సర్కారు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 26,135 ప్రభుత్వ స్కూళ్లుండగా, వాటిలో 29 లక్షల మంది చదువుకుంటున్నారు. ఆయా బడుల్లో సుమారు1.05 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. జూన్ 12 నుంచి 2023–24 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. గతనెల మొదటి వారంలోనే బడిబాట చేపట్టారు. అయితే సర్కారు బడుల్లో చేరిన స్టూడెంట్లపై  స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పిన లెక్కల్లో చాలా వరకు తప్పులే ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. తాజాగా అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.  రాష్ట్రవ్యాప్తంగా 25,381 బడుల్లోనే విద్యార్థులున్నట్టు అధికారులు లెక్కలు ప్రకటించారు. 

వీటిలోనూ 8,891 బడుల్లో 30 మంది లోపే విద్యార్థులు ఉన్నారు. వీటిలో 8,767 ప్రైమరీ, యూపీఎస్ స్కూల్స్ ఉండగా, 124 హైస్కూల్స్ ఉండటం గమనార్హం. 31 మంది నుంచి 100 మంది లోపు విద్యార్థులున్న బడులు 10,497 ఉండగా, వాటిలో ఎలిమెంటరీ లెవెల్ స్కూళ్లు 9,066, సెకండరీ లెవెల్‌‌‌‌‌‌‌‌లో 1,431 స్కూల్స్ ఉన్నాయి. ఈ లెక్కన వందలోపు స్టూడెంట్లున్న బడులు 19,388 ఉన్నాయి. అంటే మొత్తం బడుల్లో సగానికి పైగా స్కూళ్లలో వందలోపే విద్యార్థులున్నారు. 101 మంది నుంచి 250 మంది లోపు విద్యార్థులున్న బడులు 4,773 ఉండగా, వాటిలో 2,815 ఎలిమెంటరీ, 1,958 సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. 251 మంది నుంచి వెయ్యి మంది లోపు విద్యార్థున్న స్కూళ్లు 1,203 మాత్రమే ఉండగా, వాటిలో 256 ఎలిమెంటరీ లెవెల్ స్కూళ్లు, 947 సెకండరీ లెవెల్ బడులున్నాయి. మొత్తంగా వెయ్యికిపైగా విద్యార్థులు కేవలం17 స్కూళ్లలోనే ఉన్నారు.

సర్కారు పట్టించుకుంటలే

సర్కారు బడుల్లో టీచర్ల ఖాళీల భర్తీ, వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో సమస్యలతోనే గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లు నడుస్తున్నాయి. ప్రధానంగా 18 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 16 వేల మంది విద్యా వాలంటీర్లనూ మళ్లీ తీసుకోలేదు. దీంతో ఆ ఖాళీలన్నీ అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో 6 వేలకు పైగా బడులు సింగిల్ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే నడుస్తున్నాయి. 

రెండేండ్లలో వెయ్యి బడుల్లోనే వసతులు

సర్కారు బడుల్లో ఫెసిలిటీస్ కల్పిస్తామని ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టినా, పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. 26 వేలకు పైగా స్కూళ్లుంటే.. రెండేండ్లలో కేవలం వెయ్యి బడుల్లోనే వసతులు కల్పించారు. ఈ లెక్కన మొత్తం బడుల్లో వసతులు కల్పించాలంటే ఏండ్లు పట్టే అవకాశముంది. దీంతో ఇలాంటి బడుల్లో తమ పిల్లల్ని చేర్చేందుకు పేరెంట్స్ ముందుకు రావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇటీవల వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గురుకులాల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. వీటిలో ఎక్కువగా సర్కారు బడుల్లో చేరే విద్యార్థులు, ఇప్పటికే చదువుతున్న స్టూడెంట్లే వాటిలో చేరుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు తగ్గడానికి ఇదీ ఓ కారణమని అధికారులు చెప్తున్నారు.