విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో..దేశ నిర్మాణంలో భాగమవుదాం

విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో..దేశ నిర్మాణంలో భాగమవుదాం

ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఏటా సెప్టెంబర్15 న నిర్వహిస్తారు. ఆయన నిజాయతీ, క్రమశిక్షణ, గొప్ప వ్యక్తిత్వం స్మరించుకోదగ్గది. ఆయన జయంతినే ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం.1861 సెప్టెంబర్ 15 న బెంగళూరు దగ్గరలో ముద్దెనహల్లిలో పేద కుటుంబంలో జన్మించిన విశ్వేశ్వరయ్య పూర్వీకులు తెలుగువారు. ప్రకాశం జిల్లాలో మోక్షగుండం అనే గ్రామానికి చెందినవారు.

1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ, తర్వాత పుణె సైన్స్ కాలేజీ నుంచి సివిల్​ఇంజనీరింగ్​లో ఉత్తీర్ణుడయ్యాడు. 23వ ఏట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరారు. తదుపరి భారత నీటిపారుదల కమిషన్​లో చేరాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఆయన దక్కన్ ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం కలుగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను రూపొందించారు. 

1903లో మొదటిసారి దీన్ని పుణె దగ్గరి ఖడక్‌‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తర్వాత గ్వాలియర్ వద్ద, అలతిగ్రా వద్ద, మైసూరులో గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టల్లోనూ ఈ విధానం వాడారు.1906-–07 మధ్య కాలంలో ఆయనను భారత ప్రభుత్వం యెమన్ లోని ఆడెన్ కి పంపించి అక్కడి నీటి పారుదల వ్యవస్థను, మురుగు కాలువల వ్యవస్థను రూపకల్పన చేయాలని కోరింది. నిర్ధేశించిన పథకం ప్రకారం అక్కడి మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేశారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు అతని పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది.

హైదరాబాద్​ వరద ముప్పు

హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించిన ఆయనకు గొప్ప పేరు వచ్చింది. హైదరాబాద్ లో 1908 సెప్టెంబర్ 28న వచ్చిన పెద్ద వరద కారణంగా వేల మంది చనిపోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి నిజాం కోరిక మేరకు వరద బాధలను తప్పించాలని ఆనాడు మూసినదిపై ఒక ఆనకట్టతో పాటు, రెండు జలాశయాలను నిర్మించి హైదరాబాద్ ప్రజలకు తాగునీటి, మురుగు నీరు వ్యవస్థను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కనుగొన్నారు. అలాగే హుస్సేన్​సాగర్, ట్యాంక్​బండ్​కూడా వారి సలహా మేరకు నిర్మాణం జరిగింది. వారి మార్గదర్శనంలో ఏర్పాటు చేసిన రోడ్లు, తాగునీరు సరఫరా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

భారతరత్న ప్రదానం

ఈయన యావత్ ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన మహామనిషి. ఆయన100వ జయంతి1961 సెప్టెంబర్15న ‘ మేము మాటలతో కాలయాపన చేశాం, మీరు నిరంతర క్రీయాశీలురు, నవ భారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయులు’ అని అప్పటి మన ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ కొనియాడారు. ఆంగ్ల పాలకులు సైతం వారి సేవలను కొనియాడేవారు.1955లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న అవార్డును ఇచ్చి సత్కరించింది. చేతనైన వారందరూ కష్టించి పని చేయాలి. ప్రజల సంపాదన శక్తిని, చేతివృత్తుల వారిని ఒక ఇంజనీర్​గా రూపొందించాలని విశ్వేశ్వరయ్య అనేవారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కష్టించి పనిచేసే దేశభక్తుడు. పరిపాలనదక్షుడు, స్వీయ నియంత్రణ గల గొప్ప మేధావి. ఆయన1962 ఏప్రెల్ 12 న తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి వరకు కంటి అద్దాలను ఉపయోగించ లేదట, ఈనాటి యువ ఇంజనీర్లకు ఆయన జీవితమే ఆదర్శం.

నేటి పాలకుల తీరు..

 ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన దేశంలో ఇంకా కొంత మంది పాలకులకు అభివృద్ధి పనుల నాణ్యత ప్రమాణాల గురించి తెలియకపోవడం దురదృష్టకరం. ప్రస్తుత పాలకులకు అవసరమున్నా, లేకున్నా పనుల ప్రారంభానికి తొందర చేస్తారు. కాంట్రాక్టర్ పై కూడా ఒత్తిడి తెస్తారు. ఎన్నికలే ధ్యేయంగా ఆ పనిని ప్రచారంలో చెప్పుకోవాలని తొందర పెడతారు. దాదాపు70 శాతం మంది రాజకీయ నాయకులు తాను పదవిలో ఉన్న ప్రతి ప్రభుత్వ పని మీద లేదా సరఫరా మీద 5 నుంచి10 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిన రహస్యమే. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈనాడు ఇంజనీర్లలో చిత్తశుద్ధి లోపించింది. ఎక్కువగా కమీషన్లు ఆశించే ప్రభుత్వ ఇంజనీర్లు ఉన్న వ్యవస్థలో మంచి పేరున్న కాంట్రాక్ట్ సంస్థలు పెట్టుబడులు పెట్టి పని చేయడానికి ముందుకురావు. వృత్తి పరంగా నైపుణ్యం గల మంచి గుత్త సంస్థలు పక్కకు వెళ్లాయి. 

కమీషన్లు ఇచ్చే గుత్తేదారులను ప్రోత్సహించి, వారికి పెద్ద పీట వేశారు కొంతమంది ఇంజనీర్లు. నిజాయతీగా నాణ్యతతో పనిచేసి, కమీషన్లు ఇవ్వని మంచి గుత్త సంస్థల మనుగడ నేడు ప్రశ్నార్థకమైంది. మంచి సంస్థలను ప్రజలు నిలబెడతారు. డొల్ల వ్వాపార సంస్థలను అవినీతి ప్రభుత్వాలు నిలబెడతాయి.  కొంతమంది ఇంజినీర్లు ప్రభుత్వ విభాగాల్లో నిజాయతీగా ఉన్నవారు, ఎప్పటికప్పుడు తమ తమ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, నిర్మాణ వ్యయం అదుపులో ఉండేలా ప్రయత్నిస్తూ , మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అలాగే, కమీషన్లకు అలవాటు పడి వారి వృత్తి ధర్మాన్ని కాల రాసేవారు చాలా మంది ముందు వరుసలో ఉన్నారు.


- సోమ శ్రీనివాస్ రెడ్డి,
చైర్మన్, కంట్రాక్టర్స్ 
డెవలప్​మెంట్ ఇన్​స్టిట్యూట్