మంచి పనులు చేద్దాం, ప్రజల మనసు గెలుచుకుందాం

మంచి పనులు చేద్దాం, ప్రజల మనసు గెలుచుకుందాం

తాను ఇప్పటివరకు ఎప్పుడూ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6 వేల మందికి పైగా విద్యార్థులకు బైజూస్ సాఫ్ట్ వేర్ లోడింగ్ చేసిన ట్యాబ్ లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సిరిసిల్ల, వేములవాడలో అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు. అధికారం రాగానే అది శాశ్వతమని కొందరు ఊహించుకుంటారు.. కాని వచ్చిన అవకాశాన్ని ఓ మంచి పనిని చేయడానికి ఉపయోగించాలని తెలిపారు. తన పుట్టిన రోజున అనవసర ఖర్చులకు, ఆర్భాటాలకు పోకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ప్రారంభించానని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆన్ లైన్ పాఠాలు మన పేద పిల్లలకు కూడా అందాలని ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టారమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.- జిల్లాలోని ఇంటర్ విద్యార్థినీ, విద్యార్థులకు అంటే సుమారు 6000 మందికి ట్యాబ్ లు పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో ట్యాబ్ లో సుమారు 60 నుండి 70 వేల రూపాయల విలువ చేసే సాఫ్ట్ వేర్ ను బైజుస్ సంస్థ ఉచితంగా అందిస్తోందని కేటీఆర్ చెప్పారు. కొద్దిగా ఆలోచన పెడితే కొత్త ఆవిష్కరణలను రూపొందించే సత్తా అందరికి ఉంటుందన్న మంత్రి...- సిరిసిల్లలో తనపై పోటీ చేయాలనుకునే వారు కూడా ఈ విధంగా మంచి పనులు చేయండని సూచనలిచ్చారు. మంచి పనులు చేద్దామని, ప్రజల మనసు గెలుచుకుందామని నాయకులు ప్రజా ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.