వైరస్‌లకు, అప్పులకు దూరంగా బతుకుదాం

వైరస్‌లకు, అప్పులకు దూరంగా బతుకుదాం

హైదరాబాద్: వైరస్‌లకు దూరంగా ఆఫ్ ది గ్రిడ్ లైఫ్‌ను అలవాటు చేసుకోవాలని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్నారు. గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లో పూరీ మ్యూజింగ్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోమారు తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించడంతో పూరీ సరికొత్త మ్యూజింగ్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తాజాగా Off The Grid అనే థీమ్‌తో చేసిన మ్యూజింగ్‌లో భవిష్యత్తు గురించి మాట్లాడాడు. వైరస్, అప్పులు లాంటి భయాలు లేకుండా బతుకుదామంటూ పూరీ చెప్పిన సూచనలు అతడి మాటల్లోనే..

'ఆఫ్ గ్రిడ్ లివింగ్.. నాగరిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో బతకడం. ప్రజా వినియోగాలు లేకుండా బతకడం. మంచినీళ్లు‌, కరెంటు, గ్యాస్‌, ఇంటర్నెట్‌ లాంటి మౌలిక వసతులు లేకుండా జీవించడం. గోయింగ్‌ ఆఫ్‌ ది గ్రిడ్‌ అనేది కొంతమంది మాత్రమే చేయగలరు. అలా చేయాలంటే సరైన ప్రదేశాన్ని చూసుకుని ముందు ఇల్లు కట్టుకోవాలి. సోలార్‌ లాంటి పవర్‌ సోర్సులు పెట్టుకోవాలి. కుదిరితే వర్షం నీటినీ ఉపయోగించుకునేలా చూసుకోవాలి. ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్‌’ను ఫాలో అయ్యేవాళ్లు కమ్యూనికేషన్‌ కోసం శాటిలైట్‌ ఫోన్‌ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ల ఆహారాన్ని వాళ్లే పండించుకుంటారు. పశువులు, కోళ్లను పెంచుకుంటారు. పర్యావరణసహిత ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. పశువుల పేడతో గోబర్‌ గ్యాస్‌ తయారు చేస్తారు. దాన్నే పంటలకు ఎరువుగా కూడా వాడతారు. అన్నిరకాల చెట్లు పెంచుకుంటారు. ధాన్యం, మొక్కజొన్న కూడా పండిస్తారు. వాళ్లకి కరెన్సీతో పనిలేదు. అప్పులు లేని జీవితం. జీవితాంతం ప్రతినెలా ఎవ్వరికీ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. అప్పులవాళ్లు వచ్చి వాళ్ల ఇంటి తలుపులు కొట్టరు. ఎలాంటి నోటీసులు వాళ్ల ఇంటికి రావు’. 

'ప్రపంచంలో 35 మిలియన్ల మంది ఇలా ‘ఆఫ్‌ ది గ్రిడ్‌’ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పర్యావరణం పట్ల వీళ్లు ఎంతో బాధ్యతగా ఉంటారని చెప్పొచ్చు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. మన పూర్వీకులు ఇలాగే ఎన్నో వేల సంవత్సరాలు బతికారు. వీళ్లు కూడా ఆనాటి పూర్వీకుల జీవనశైలిని ఫాలో అవుతుంటారు. అప్పట్లో అందరిదీ ‘ఆఫ్‌ గ్రిడ్‌ లివింగే’ కాబట్టే మన భూమి ఎంతో పచ్చగా ఉండేది. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.  వంద డైనోసార్లు అడవిలో పుట్టి అదే అడవిలో చనిపోతే ఈ ప్రకృతికి కూడా గుర్తు ఉండదు. అదే నలుగురు మనుషులు బతికి చనిపోయిన తర్వాత చూస్తే అడవి సగం నరికేసి ఉంటుంది. అందుకే ప్రకృతి మనల్ని గుర్తు పెట్టుకుంటుంది. మనకు ప్రకృతిలో బతకడం రాదు'.

'ఆఫ్‌ గ్రీడ్‌గా జీవించేవాళ్లు ఈ ప్రకృతికి ఎంతో అవసరం. మనందరం జీవితంలో ఇలాంటి ఆఫ్‌ గ్రిడ్‌ ఇళ్లు కట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ వైరస్‌ల నుంచి దూరంగా.. సంతోషంగా బతకాలంటే ఇలాంటిది మనకు కావాలె. సిటీలకు దూరంగా ఇలాంటి ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే.. మన భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉండనుంది. మీ పిల్లలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే అది ఇదే. దగ్గరలో ఆస్పత్రి లేకపోతే ఎలా అని భయపడొద్దు. అక్కడ రోజూ పనిచేసుకుంటూ బతికితే మీకు ఎలాంటి జబ్బులు ఉండవు. పోతే వృద్ధాప్యంతోనే పోతారు. నీటిలో చేపల్లాగా, గాలిలో పక్షుల్లాగా, అడవిలో జంతువుల్లాగా.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్రీగా, హాయిగా బతికే మార్గం ఆఫ్‌ ది గ్రిడ్‌. వెనక్కెళ్లి బతుకుదాం. ముందుకెళ్లి పీకేది ఏమీ లేదు' అని పూరీ పేర్కొన్నారు.