సీఎం సభను సక్సెస్ చేద్దాం : చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి

సీఎం సభను సక్సెస్ చేద్దాం : చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి
  •  పీసీసీ చీఫ్​గా రేవంత్ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది 
  • ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషం
  • సభకు నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలిస్తున్నామని వెల్లడి   

మందమర్రి, వెలుగు: ఇంద్రవెల్లిలో శుక్రవారం జరగనున్న తెలంగాణ పునర్నిర్మాణ సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఇంద్రవెల్లి సభకు 10 వేల మందిని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ మాట్లాడారు. ‘‘పీసీసీ ప్రెసిడెంట్​గా రేవంత్​రెడ్డి ప్రస్థానం ఇంద్రవెల్లి నుంచే ప్రారంభమైంది. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా నుంచి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్ సర్కార్​ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నాం. మిగిలిన గ్యారంటీల అమలుకు సర్కార్ ​కార్యాచరణ సిద్ధం చేస్తోంది” అని తెలిపారు. 

కేసీఆర్​ను ఎందుకు అరెస్ట్​ చేయట్లేదు? 

మాజీ సీఎం కేసీఆర్​తన తుగ్లక్​నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారని వివేక్ మండిపడ్డారు. ‘‘మరో రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును కాదని.. కేసీఆర్ రీడిజైనింగ్​పేరుతో కాళేశ్వరం కట్టిండు. రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశాడు. అలాంటి కేసీఆర్​ను ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్టు చేయడం లేదు” అని ప్రశ్నించారు. వెంటనే కేసీఆర్​ను అరెస్ట్​ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ‘‘మిషన్​భగీరథలోనూ పాత పైపులు వేసి రూ.40 వేల కోట్లు దోచుకున్నారు.

 కేసీఆర్​ఫ్యామిలీ, ఆయన బంధుగణం హైదరాబాద్ చుట్టుపక్కల 20 వేల ఎకరాల భూములను ధరణి పోర్టల్​​ద్వారా కాజేసింది. జీహెచ్ఎంసీలోనూ చేయని పనులకు బిల్లులను విత్​డ్రా చేసిన కుంభకోణం కూడా ఇటీవల బయటపడింది. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్.. తెలంగాణను రూ.6.70 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు” అని ఫైర్ అయ్యారు. ‘‘తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి బీఆర్ఎస్​అవినీతి, అక్రమాలను బయటపెట్టిందనే అక్కసుతో వీ6 చానెల్, వెలుగు పత్రికపై కుట్రలు చేశారు. కానీ వారి చర్యల వల్ల వీ6, వెలుగుకు మరింత జనాదరణ పెరిగింది” అని అన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కేటీఆర్..​ కాంగ్రెస్ సర్కార్​వచ్చి 60 రోజులు కాకముందే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.