రైతులకు ఇబ్బందులు రానివ్వం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రైతులకు ఇబ్బందులు రానివ్వం :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •  బీఆర్​ఎస్​ కారణంగా నిర్వాసితులుగా అన్నదాతలు 

హైదరాబాద్: ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వబోమని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ  ఉదయం ట్రిపుల్​ ఆర్​లో భూములు కోల్పోతున్న సిద్దిపేట్​ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డిని బంజారాహిల్స్ లోని  ఆయన నివాసంలో  కలిశారు. ఈ సందర్భంగా  రైతులు మాట్లాడుతూ ఇటీవల ట్రిపుల్​ ఆర్​ భూసేకరణకు నోటీసులు వచ్చాయన్నారు. 

తాము ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూనిర్వాసితులం అయ్యామన్నారు.తమకు మిగిలిన కొద్దిపాటి భూములను  మళ్లీ  ట్రిపుల్ ఆర్ లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  అలైన్ మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని వారు మంత్రికి విన్నవించారు. అనంతరం మంత్రి  వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్  నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. 

 సీఎం రేవంత్ రెడ్డితో  చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటి వరకు రైతులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన ప్రాజెక్టు వల్ల ప్రజాధనం వృధా అవడమే కాకుండా రైతులు నిర్వాసితులుగా, బాధితులుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలతో ట్రిపుల్ ఆర్  కు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలు పోకుండా,  రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.