అర్హులందరికి ఇండ్లు ఇద్దాం .. గైడ్ లైన్స్ రెడీ చేయండి: రేవంత్​రెడ్డి

అర్హులందరికి ఇండ్లు ఇద్దాం  .. గైడ్ లైన్స్ రెడీ చేయండి: రేవంత్​రెడ్డి
  • గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక 
  • రెండు విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల సాయం
  • హౌసింగ్ అధికారులతో సీఎం రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటి స్కీమ్ లో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా స్కీమ్ అమలు చేయాలన్నారు. సోమవారం సెక్రటేరియెట్​లో హౌసింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టారు. ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 82 లక్షల అప్లికేషన్లు రావడంతో ఇంత మంది ఇండ్లు లేని వాళ్లు ఉన్నారా అని సీఎం అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. 

 గత ప్రభుత్వంలో ఎన్ని ఇండ్లు ఇచ్చారో.. వారి లెక్కల ప్రకారం ఇంకెంత మంది మిగిలి ఉన్నారు అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 2.91 లక్షలు శాంక్షన్ చేసినప్పటికీ ఇందులో 1 లక్షా 60 వేలు మాత్రమే నిర్మించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.  అయితే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను అలా కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా లక్షల మంది పేదలకు లబ్ధి జరిగేలా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్లతో గ్రామసభలు ఏర్పాటు చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల సాయం రెండు విడుతల్లో లబ్ధిదారులకు అందేలా గైడ్ లైన్స్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. రివ్యూలో హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాత్రి వరకు సెక్రటేరియెట్​లోనే సీఎం 

సోమవారం సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్ రెడ్డి తీరిక లేకుండా గడిపారు. ఉదయం 11 గంటలకు వచ్చిన సీఎం రాత్రి దాదాపు 11 వరకు సెక్రటేరియెట్​లోనే ఉన్నారు. హెల్త్, హౌసింగ్ రివ్యూలతో పాటు నేతలు, ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు.