మరోసారి సమీర్‌‌ వాంఖడేపై విరుచుకుపడ్డ నవాబ్‌ మాలిక్‌

మరోసారి సమీర్‌‌ వాంఖడేపై విరుచుకుపడ్డ నవాబ్‌ మాలిక్‌

బాలీవుడ్‌ స్టార్‌‌ షారుఖ్ ఖాన్‌ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసినప్పటి నుంచి మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్ రోజూ ఎన్సీబీ ఆఫీసర్‌‌ సమీర్‌‌ వాంఖడేపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. నిన్న సమీర్‌‌ను ఆర్యన్ కేసు దర్యాప్తు నుంచి పక్కన పెట్టి ఢిల్లీ సెంట్రల్‌ ఆఫీస్‌ సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి సమీర్‌‌పై నవాబ్‌ విరుచుకుపడ్డారు. సమీర్ వాంఖడేను ఆ కేసు దర్యాప్తు నుంచి తప్పించినట్లు ఎన్సీబీ డీజీ నిన్న ప్రకటించిన తర్వాత నవాబ్ మాలిక్ ఇదేం కొత్త విషయం కాదంటూ ట్వీట్ చేశారు. సమీర్‌‌ వాంఖడేను ఆర్యన్‌ కేసుతో పాటు ఐదు కేసుల నుంచి తప్పించారని పేర్కొన్నారు. మొత్తంగా 26 కేసుల్లో సమీర్‌‌పై దర్యాప్తు చేయాల్సి ఉందని, ఇది ఆరంభం మాత్రమేనని, వ్యవస్థను ప్రక్షాళన చేయడం కోసం చేయాల్సింది చాలా ఉందని, తాము ఆ పనిని చేసి చూపిస్తామని నవాబ్ మాలిక్ అన్నారు.

మరోవైపు సమీర్‌‌ వాంఖడే మాత్రం తనను ఈ కేసు దర్యాప్తు నుంచి తొలగించలేదని చెప్పినట్లు న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసింది. అలాగే పైగా ఆర్యన్ కేసును ఢిల్లీ సెంట్రల్ టీమ్‌తో ఇన్వెస్టిగేషన్ చేయించాలని తానే కోర్టులో రిట్‌ పిటిషన్ వేశానని సమీర్‌‌ చెప్పినట్లు ఆ ట్వీట్‌లో ఉంది. దీనిపైనా నవాబ్‌ మాలిక్ స్పందించారు. ఒకటి ఏఎన్‌ఎఐ పొరబాటుగా వార్తను రిపోర్ట్‌ చేసి ఉండాలని, లేదా సమీర్‌‌ వాంఖడే అబద్ధం చెప్పి, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. వాస్తవానికి సమీర్ రిట్ పిటిషన్ వేసింది ఆర్యన్ కేసుకు సంబంధించి కాదన్నారు నవాబ్ మాలిక్. మహారాష్ట్ర సర్కారు సమీర్‌‌ వాంఖడేపై వేసిన ఎంక్వైరీని నిలిపేసి, సీబీఐ లేదా ఎన్‌ఐఏ దర్యాప్తు చేసే ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రిట్ వేశారన్నారు. ఆ రిట్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని నవాబ్‌ మాలిక్ తెలిపారు. ఈ విషయంలో దేశ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు.

ఇక ‘‘సమీర్‌‌ దావూద్‌ వాంఖడే’’పై వచ్చిన ఆరోపణలపై సిట్ విచారణ చేయాలని తాను డిమాండ్ చేశానంటూ ఇవాళ ఉదయం మరో ట్వీట్ చేశారాయన. ఆర్యన్ డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంపై నిగ్గుతేల్చాల్సి ఉందన్నారు. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం ఏర్పాటు చేసిన రెండు వేర్వేరు సిట్ దర్యాప్తుల్లో ఏది సమీర్ వాంఖడే చీకటి ప్రపంచం గురించిన వాస్తవాలను బయటపెడుతుందో చూడాలని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

నమస్తే ఇండియా.. రెడీగా ఉండండి: టైసన