కాఫీ.. టీ.. బతాఖానీ.. ఈ మూడు చాలా రిలాక్స్ ఇస్తాయి.. అంతేనా డీల్స్ ఏమైనా డిస్కషన్ చేసుకోవటానికి కాఫీ షాపు.. హోటల్స్ బెస్ట్ స్పాట్.. ఇప్పుడు ఇదే బెంగళూరులో ఓ హోటల్ కు పెద్ద సమస్యగా మారింది. కాఫీ, టీలు తాగుతూ గంటలు గంటలు మీటింగ్ పెట్టుకుంటున్నారంట.. తిని, తాగే బిల్లు తక్కువ.. కరెంట్ బిల్లు ఎక్కువ.. దీనికితోడు వచ్చే కస్టమర్లకు సీట్లు దొరకటం లేదంట.. దీన్ని గమనించిన హోటల్ ఓనర్.. సరికొత్త నిర్ణయం తీసుకోవటమే కాదు.. సరికొత్త ఐడియాతో ఏకంగా బోర్డు పెట్టేశాడు.. మీటింగ్స్ పెట్టుకోండి.. గంటలు గంటలు కూర్చోండి.. వెయిటింగ్ ఛార్జీ వసూలు చేస్తానంటూ అతను పెట్టిన కండీషన్.. ఇప్పుడు బెంగళూరు సిటీలో హల్ చల్ చేస్తోంది.
బెంగళూరు అనగానే మనకు గుర్తొచ్చేది స్టార్టప్‌లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. అక్కడ కేఫ్‌లలో కూర్చుని గంటల తరబడి ఆఫీస్ పనులు చేసుకోవడం, మీటింగ్‌లు జరుపుకోవడం చాలా మామూలు విషయం. అయితే, దీని వల్ల వ్యాపారం దెబ్బతింటోందని ఒక కేఫ్ యజమాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
అసలు విషయం ఏంటంటే... శోభిత్ బక్లివాల్ అనే ఒకతను సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో మీరు ఒక గంట కంటే ఎక్కువ సేపు ఇక్కడ మీటింగ్‌లు నిర్వహిస్తే.. గంటకు రూ.1,000 చొప్పున ఛార్జ్ వసూలు చేయబడుతుంది. ఇక్కడ మీటింగ్‌లు అనుమతి లేదు అని ఉంది. ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికే వేల వ్యూస్ వచ్చాయి, చాలా మంది దీనిపై స్పందిస్తూ రకరకాలుగా కామెంట్స్ చేసారు.
కొందరు కేఫ్ యజమానులు, నెటిజన్లు ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. వారు చెప్పేది ఏంటంటే.. కస్టమర్లు చేసే ఆర్డర్లు తక్కువ.. కూర్చునే సమయం ఎక్కువ. కొంతమంది కేఫ్‌కి వచ్చి ఒక కప్పు కాఫీ లేదా ఒక ప్లేట్ స్నాక్స్ ఆర్డర్ చేసి టేబుల్‌ను మాత్రం గంటల తరబడి ఆక్రమిస్తారు.
రద్దీగా ఉండే సమయాల్లో కొత్త కస్టమర్లు వస్తుంటారు. కానీ పాత కస్టమర్లు టేబుల్స్ ఖాళీ చేయకపోవడం వల్ల కొత్త కస్టమర్లని పంపించేయాల్సి వస్తోంది. కొందరైతే గట్టిగా బిజినెస్ వ్యవహారాలు లేదా రాజకీయ చర్చలు చేస్తూ ఇతర కస్టమర్లకు అసౌకర్యం కలిగిస్తున్నారు. దీని వల్ల వ్యాపారంపై బాగా దెబ్బతింటుంది.
పబ్‌లు లేదా బార్లలో ఇలాంటి సమస్య ఉండదు, ఎందుకంటే అక్కడ కస్టమర్లు వరుసగా ఆర్డర్లు ఇస్తూనే ఉంటారు. కానీ తక్కువ ధరలో ఫుడ్ దొరికే కేఫ్‌లలోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది అని ఒకరు అనగా... మరికొందరు మాత్రం.. కేఫ్ అంటేనే ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునే చోటు, ఇలాంటి రూల్స్ కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయంపై కేఫ్ యాజమాన్యం ఇంకా అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ 'వర్క్ ఫ్రమ్ కేఫ్' కల్చర్ పెరుగుతున్న టైంలో ఇది పెద్ద చర్చకు దారితీసింది.
