చదువులను తండాలకు తీసుకెళ్తాం : సీఎం రేవంత్ రడ్డి

చదువులను తండాలకు తీసుకెళ్తాం : సీఎం రేవంత్ రడ్డి
  •  అన్ని సౌలత్​లతో స్కూళ్లు కడ్తం 
  • చదువుకుంటేనే సమాజంలో గౌరవం పెరుగుతది
  • సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో సీఎం

హైదరాబాద్, వెలుగు: చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చదువులను తండాలకు తీసుకెళ్లే బాధ్యత తమదని చెప్పారు. అన్ని తండాల్లోనూ స్కూళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బంజారాలు సంత్ సేవాలాల్ మార్గంలో నడవాలని, అందరూ చదువు బాట పట్టాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్​ను సకల హంగులతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్​లోని బంజారా భవన్​లో సంత్​ సేవాలాల్​ 285వ జయంతి వేడుకలు నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామపంచాయతీలుగా మారిన తండాలకు బీటీ రోడ్లు వేస్తామని, పంచాయతీ భవనాలను నిర్మిస్తామని చెప్పారు. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. 70 రోజుల్లో తాము ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, ఇది ఎవరికీ కనిపించకుండా దాక్కొనే ప్రభుత్వం కాదని, అందరి అభ్యున్నతి కోసం కష్టపడే ప్రభుత్వమని స్పష్టం చేశారు. 

‘‘బంజారా సోదరులను కలవడమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందం. 1976లో బంజారాలను ఇందిరా గాంధీ ఎస్టీల్లో చేర్చారు. వారికి దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియా గాంధీది. దొరల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని మీరు నినదించారు. మీ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించింది. సేవాలాల్ జయంతి జరిపేందుకు కోటి కాదు.. మరో కోటి జత చేసి రూ.2కోట్లు విడుదల చేస్తున్నాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.