త్వరలో లెవెల్ ఫోర్ ట్రామా కేర్.. గోల్డెన్ అవర్‎లో చికిత్స అందించడమే లక్ష్యంగా పక్కా నెట్వర్క్

త్వరలో లెవెల్ ఫోర్ ట్రామా కేర్.. గోల్డెన్ అవర్‎లో చికిత్స అందించడమే లక్ష్యంగా పక్కా నెట్వర్క్
  •  గోల్డెన్ అవర్ లో చికిత్స అందించడమే లక్ష్యంగా స్టేట్ ట్రామా కేర్ పాలసీ  
  • యాక్సిడెంట్ స్పాట్ నుంచి పెద్ద హాస్పిటల్ వరకు పక్కాగా నెట్​వర్క్
  • రాష్ట్ర వ్యాప్తంగా 911 బ్లాక్ స్పాట్స్ గుర్తించిన ఆరోగ్యశ్రీ 
  • ప్రతీ 35 కిలో మీటర్లకు ఒక ట్రామా సెంటర్ 
  • హైవేల వెంట 74 ట్రామా సెంటర్ల ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్‌‌‎తో ముందుకెళ్తున్నది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్‎లోనే బాధితులకు మెరుగైన వైద్యం అందించి మృత్యువు నుంచి తప్పించేలా చర్యలు చేపట్టబోతున్నది. ఇందుకోసం ప్రభుత్వం స్టేట్ ట్రామా కేర్ పాలసీని రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హైవేల ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. 

అయితే, ట్రామా కేర్ సెంటర్లు మాత్రమే కాదు, పేషెంట్ కండీషన్‎ను బట్టి చికిత్స అందించేందుకు యాక్సిడెంట్ స్పాట్ నుంచి టెర్షియరీ కేర్ హాస్పిటల్ వరకు నాలుగంచెల వ్యవస్థను పటిష్టం చేయనుంది. ఈ నెట్వర్క్ ద్వారా బాధితులకు మెరుగైన వైద్యం, సకాలంలో చికిత్స అందనుందని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి సంబంధించిన పాలసీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. 

ఫోర్ లెవెల్ చైన్ సిస్టమ్..

యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి పేషెంట్ కండిషన్‌‌‎ను బట్టి వైద్యం అందేలా ఈ నెట్‌‌ వర్క్‌‎ను డిజైన్ చేశారు. మొత్తం నాలుగు లెవెల్స్‎లో సర్వీస్‎లను విభజించి చికిత్సను అందించేలా ప్లాన్ చేస్తున్నారు. నాలుగో లెవెల్‎లో ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌‎కు చేరుకునే 108 అంబులెన్స్ ఇక్కడ మొదటి రెస్పాండర్‌‎గా పనిచేస్తుంది. అంబులెన్స్‌‎లోనే ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తూ దగ్గరలోని సెంటర్‌‏కు తరలిస్తారు. ఇందుకోసం ప్రతి ట్రామా కేర్ సెంటర్‎కు ఒక అంబులెన్స్‎ను ఏర్పాటు చేయనున్నారు. 

మూడో లెవెల్‎లో జిల్లా హాస్పిటల్స్‎లో ఏర్పాటు చేయనున్న ట్రామాకేర్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తారు. రెండో లెవెల్‎లో జిల్లాల్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్(టీచింగ్ హాస్పిట్స్)లో ట్రామా ట్రీట్మెంట్, మేజర్ సర్జరీలు చేస్తారు. ఇక ఫైనల్‎గా మొదటి లెవెల్‎లో అత్యంత విషమంగా ఉన్న కేసులను హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, త్వరలో ప్రారంభించబోయే టిమ్స్ తోపాటు వరంగల్‌‌ లోని ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్​కు తరలించి అడ్వాన్స్‌‌డ్ ట్రీట్‌‌మెంట్ అందిస్తారు.

911 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు.. 

ప్రస్తుతం హైవేలపై ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు 108, ఆరోగ్యశ్రీ సంస్థలు కలిసి సర్వే చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 911 బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు గుర్తించాయి. ఈ బ్లాక్ స్పాట్స్ ఆధారంగానే కొత్తగా ఏర్పాటు చేయనున్న 74  ట్రామా కేర్ సెంటర్ల లొకేషన్లను ఖరారు చేశారు. యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి 35 కిమీలోపే ట్రామా వైద్యం అందేలా నెట్వర్క్​ను రూపొందించారు. 

ఈ భారీ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సాయం అందించనుంది. మొత్తం 74 సెంటర్లలో అధునాతన మెడికల్ ఎక్విప్‌‌మెంట్, వెంటిలేటర్లు, ఎమర్జెన్సీ థియేటర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో సెంటర్‎ను రూ.5.3 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. హైవేలపై ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకోవడం, పేషెంట్ పరిస్థితిని బట్టి తర్వాతి స్థాయి హాస్పిటల్‌‌‎కు రిఫర్ చేయడం అంతా ఒక చైన్ సిస్టమ్‎లా సాగనుంది.