మెగా ఐపీఓకు ఎల్​ఐసీ

 మెగా ఐపీఓకు ఎల్​ఐసీ
  • వచ్చే వారం సెబీ వద్ద ఐపీఓ పేపర్లు 
  • మార్చిలోనే లిస్టింగ్​

న్యూఢిల్లీ: లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్​ఐసీ) మెగా ఐపీఓకు డ్రాఫ్ట్​ ప్రాస్పెక్టస్​ను వచ్చేవారంలోనే సెబీ వద్ద ప్రభుత్వం ఫైల్​ చేయనుంది. ఐపీఓలో కొంత భాగాన్ని యాంకర్​ ఇన్వెస్టర్ల కోసం పక్కకి పెట్టనున్నట్లు సీనియర్​ ఆఫీసర్​ ఒకరు వెల్లడించారు. ఐఆర్​డీఏఐ నుంచి అప్రూవల్​ కోసం ఎదురు చూస్తున్నామని, అది రాగానే సెబీ వద్ద పేపర్లు ఫైల్​ చేస్తామని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ పబ్లిక్​ ఎసెట్​ మేనేజ్​మెంట్​ (దీపమ్​) సెక్రటరీ తుహిన్​ కాంత పాండే చెప్పారు. ఐపీఓ సైజు ఎంతనేది అప్పుడే ఖరారవుతుందని పేర్కొన్నారు. సెబీ అనుమతి రాగానే మార్చి నెలలో మార్కెట్లోకి ఐపీఓ వస్తుందని చెప్పారు. డిజిన్వెస్ట్​మెంట్​ టార్గెట్​ అందుకోవడానికి ప్రభుత్వానికి ఇప్పుడు ఎల్​ఐసీ ఐపీఓ కీలకంగా మారింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో డిజిన్వెస్ట్​మెంట్​ ద్వారా రూ. 78 వేల కోట్లు సేకరించాలనేది ప్రభుత్వ టార్గెట్​. ఎయిర్​ ఇండియా సేల్​ ద్వారా ఇప్పటికే రూ.  12 వేల కోట్లను ప్రభుత్వం తెచ్చుకోగలిగింది. ఎల్​ఐసీ విలువను లెక్కకట్టామని, ఇప్పుడు ఐఆర్​డీఏఐ అనుమతి కోసం వేచి ఉన్నామని పాండే పేర్కొన్నారు. రాబోయే వారం, పది రోజులలోనే ఎల్​ఐసీ ఐపీఓ పేపర్లను సెబీ ముందుకు తీసుకెళ్లగలమని ఆయన చెప్పారు. చాలా విషయాల కోసం ఇప్పటికే సెబీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఐపీఓను పూర్తి చేసి మార్చి నెలలోనే లిస్టింగ్​ చేయాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఐఆర్​ఎఫ్​సీ, రెయిల్​టెల్​ ఐపీఓల తరహాలోనే యాంకర్​ ఇన్వెస్టర్లకు కొంత భాగాన్ని పక్కకి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. పాలసీ హోల్డర్ల కోసం ఐపీఓలో పది శాతాన్ని రిజర్వ్​ చేయనున్నట్లు కూడా పాండే వెల్లడించారు.

ఎల్​ఐసీ ఎంబెడ్డెడ్ వాల్యూను మిలిమన్​ అడ్వైజర్స్​ లెక్కకట్టిందని, డెలాయిట్​, ఎస్​బీఐ క్యాప్స్​లు ప్రీ ఐపీఓ ట్రాన్సాక్షన్​ అడ్వైజర్లని పాండే చెప్పారు. భవిష్యత్​లో రాబోయే లాభాలను కూడా ప్రస్తుత నెట్​ ఎసెట్​ వాల్యూలోనే ఇన్సూరెన్స్​ కంపెనీలు లెక్కించడాన్ని ఎంబెడ్డెడ్​ వాల్యూ మెథడ్​ అంటారు. ఎల్​ఐసీ మెగా ఐపీఓ కోసం ఏకంగా పది మంది మర్చంట్​ బ్యాంకర్లను ప్రభుత్వం నియమించింది. గోల్డ్​మన్​ సాచ్స్​, సిటి గ్రూప్​ గ్లోబల్​ మార్కెట్స్​, నోమురా ఫైనాన్షియల్​ ఎడ్వైజరీలు అందులో ఉన్నాయి. ​ 

ఎఫ్​డీఐ కోసం మార్పులు....
ఎల్​ఐసీ డిజిన్వెస్ట్​మెంట్​ కోసం ఎఫ్​డీఐ పాలసీలో అవసరమైన మార్పులనూ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​ (డీపీఐఐటీ) చేస్తోంది. ఫైనాన్స్​ మినిస్ట్రీ నుంచి సూచనలు ఇప్పటికే డీపీఐఐటీ తీసుకుంది. ఈ మార్పులు చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు డీపీఐఐటీ సెక్రటరీ అనురాగ్​ జైన్​ చెప్పారు. త్వరలోనే ఇది పూర్తవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వివిధ డిపార్ట్​మెంట్ల నుంచి వచ్చే సూచనలు ఈ ఫైనలైజేషన్​కు సాయపడతాయని పేర్కొన్నారు. ఇది పూర్తయితే వెంటనే కేబినెట్​ముందుకు పంపుతామని చెప్పారు. ఐపీఓలో షేర్లు కొనేందుకు ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్లకు మాత్రమే సెబీ రూల్స్​ ప్రకారం అనుమతి ఉంది. ఎల్​ఐసీ ఇన్సూరెన్స్​ కంపెనీగా కాకుండా కార్పొరేషన్​గా ఉండటంతో ఇప్పుడు ఎఫ్​ఐఐ, ఎఫ్​పీఐ పెట్టుబడుల కోసం ఎఫ్​డీఐ రూల్స్​ మార్చాల్సి వస్తోంది. ఎల్​ఐసీ ఐపీఓకు కిందటేడాది జులైలోనే ఎకనమిక్​ ఎఫెయిర్స్​ కేబినెట్​ కమిటీ ఆమోదం తెలిపింది.